Akun Sabharwal Tollywood drugsపూరీ జగన్నాధ్… శ్యాం కే నాయుడు… సుబ్బరాజు… డ్రగ్స్ కేసులో ఇలా వరుసగా జరుగుతున్న విచారణపై తాజాగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పందించారు. “డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరవుతున్నారని… తమతో సహకరిస్తున్నారని… విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చి, ఎవరు ఏమి చెప్పినా తమకు సమస్య లేదని… తమ వద్ద విచారణకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని” తెలిపారు.

డ్రగ్స్ ముఠా మీద యుద్ధం చేస్తున్నామని… హైదరాబాద్ ను సేఫ్ అండ్ క్లీన్ సిటిగా మారుస్తామని… తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయో ఈ విచారణ ద్వారా తమకు తెలిసిందని అన్నారు. డ్రగ్స్ వాడుతున్న స్కూలు పిల్లల పేర్లను తాము బయట పెట్టలేదని చెప్పారు. త‌న సెల‌వుల‌ను సైతం ర‌ద్దు చేసుకుని అకున్ సబర్వాల్ ఈ విచారణను చేపట్టిన విషయం తెలిసిందే. సినీ ప్ర‌ముఖులను విచార‌ణ చేస్తుండడంతో లోపల విషయాలను బయటకు రాకుండా అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇక మూడవ రోజు విచారణకు హాజరైన నటుడు సుబ్బరాజును దాదాపుగా ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ వ్య‌వ‌హారంలో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సుబ్బ‌రాజుకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయ‌న్న విష‌యంపై అధికారులు ప్ర‌శ్నించారు. పూరీ జగన్నాధ్ మాదిరిగానే ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చిన నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ బ్యూరో సుబ్భారాజు నుండి కూడా బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్నారు. మూడు రోజుల విచారణలో భాగంగా తమకు కీలక సమాచారం లభించిందని సిట్ అధికారులు చెప్తున్నారు.