Tollywood Drugs Case investigation ends todayగత నెల రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. గాయని గీతామాధురి భర్త నందు విచారణతో సెలబ్రిటీల విచారణతో ఈ హంగామా ముగియనుంది. మరి దీని తర్వాత ఏం జరగనుంది? ఇటీవల మీడియా వర్గాలలో ప్రసారం చేసినట్లుగా కొందరు సినీ ప్రముఖులను అదుపులో తీసుకునే అవకాశాలు ఉంటాయా? లేక ఈ సారికి సినీ ప్రముఖులు బయటపడ్డట్లేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకు మరో మూడు, నాలుగు రోజుల్లో సిట్ అధికారుల నుండి అధికారిక సమాచారం లభించవచ్చు.

అయితే ఇప్పటివరకు ఏ మీడియా ఛానల్స్ అయితే ఈ కేసులో ఓ హీరో, దర్శకుడు అరెస్ట్ తప్పదంటూ కధనాలు ప్రసారం చేసిందో, అదే మీడియా ఛానల్ ప్రస్తుతం ఈ కేసులో సినీ ప్రముఖులందరికీ ఊరట లభించినట్లేనన్న అంచనాలు వేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జిశాన్, మైక్ కమింగాలు సహా మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన అధికారులు త్వరలో వారిపై చార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ తో, ఈ కేసులో సెకండ్ జాబితా లేదన్న విషయం హైలైట్ అవుతోంది.

ఇప్పటివరకూ 11 మంది సినీ ప్రముఖులను దాదాపు 88 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు, అరెస్టయిన నిందితులకు, వీరికి ఉన్న సంబంధాలను ఎంతవరకు చేధించిందో అన్న సమాచారం బయటకు రాకపోవడమే ఈ ఊహాగానాలకు తెరలేపినట్లయ్యింది. మరి ఈ విచారణ వలన ప్రయోజనం ఏంటి? అంటే ఈ ప్రముఖులందరినీ సాక్షుల జాబితాలో పేర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 29 మందిని సాక్షులుగా చేర్చాలని భావిస్తున్నామని, తమకు అప్పగించిన పని ముగిసినట్టేనని ఓ సిట్ అధికారి తెలిపారు.

ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నామని చెప్పడంతో ఈ కథ కంచికి… సెలబ్రిటీలు ఇంటికి చేరినట్లేనన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. ఓ పక్కన విచారణ జరుగుతున్నపుడు… కీలక సమాచారం లభించిందని మీడియా వర్గీయులకు లీకులు రాగా, ప్రస్తుతం అదే మీడియా వర్గాలలో ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రసారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అతి త్వరలో తెలియనుంది.