Tollywood-Drug-Addicts--Ravi-Teja-Tarun-Charmi-Kaur-Puri-Jagannadh!
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ చిత్రాలు చేసి, ప్రస్తుతం సినిమాలు లేఖ ఖాళీగా ఉన్న హీరో తరుణ్…ఇప్పుడు చిత్రాలు లేక ఖాళీగా ఉన్న యువ హీరో నవదీప్…ముంబైలో ఉండి ఐటమ్ సాంగ్స్ కోసం హైదరాబాద్ వచ్చి పోయే హాట్ బాంబ్ ముమైత్ ఖాన్…ఓ ప్రముఖ యువగాయని భర్త… గీతామాధురి భర్త నందు…సినిమాలు త్వరగా పూర్తి చేస్తారని పేరున్న సంచలన డైరెక్టర్… పూరీ జగన్నాథ్…హిట్ చిత్రాల్లో నటిస్తూ, ప్రొడక్షన్ పనులను కూడా పర్యవేక్షిస్తూ, నిర్మాతలకు సహకరించే హీరోయిన్ చార్మి…

వీరందరి పేర్లూ డ్రగ్స్ దందాలో నేడు బయటకు వచ్చాయి. కానీ, నిన్న మొన్నటి వరకు వీరి పేర్లపై పోలీసు వర్గాలు చెప్పి చెప్పకుండా దాచి ఉంచారు. డైరెక్టుగా పేర్లను చెప్పకుండా వారు చేస్తున్న పనులు, వారికి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపును చెబుతూ లీకులు ఇచ్చాయి. సినీ అభిమానులు కూడా వీరి పేర్లు ఉంటాయని ముందుగానే ఊహించేశారు కూడా. ఇక వీరిని విచారణకు పిలిచిన పోలీసులు, తాము వాడేందుకే డ్రగ్స్ ఆర్డర్ చేశారా? లేక మరెవరికైనా ఇచ్చేందుకు లేదా విక్రయించేందుకు ఆర్డర్ చేశారా? అన్న విషయాన్ని తేల్చనున్నారు.

డ్రగ్స్ కు బానిసలై వాడుతూ ఉంటే, కౌన్సెలింగ్, రీహాబిటేషన్ సెంటర్లకు సిఫార్సులు చేస్తామని, వారు వేరే వారికి ఇవ్వడం లేదా విక్రయించడం చేసినట్టు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీరందరితో పాటు తాజాగా హీరో రవితేజకూ నోటీసులు వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రవితేజను కూడా 19వ తేదీ నుంచి వారం రోజుల్లోగా విచారణకు రావాలని కోరినట్టు తెలిపాయి. ఇటీవల మరణించిన రవితేజ సోదరుడు భరత్ పేరు కెల్విన్ కాల్ లిస్టులో ప్రముఖంగా కనిపించిందని సమాచారం.

నోటీసులు ఇచ్చేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేకపోగా, ఆయన ఇంటికి వెళ్లి, అక్కడున్న ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. చార్మీ హైదరాబాద్ లో లేకపోవడంతో ఆమె ఆఫీసుకు వెళ్లిన అధికారులు అక్కడి మేనేజర్ కు నోటీసులు ఇచ్చారు. ముమైత్ ఖాన్ కూడా హైదరాబాద్ లో లేకపోవడంతో, ఇక్కడ ఆమె డేట్స్ పరిశీలించే మేనేజర్ కు నోటీసులు స్వయంగా ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, తరుణ్, సుబ్బరాజు ఇళ్లకు వెళ్లిన సిట్ సిబ్బంది వారి సమీప బంధువులకే నోటీసులు ఇచ్చారు. అధికారులు వెళ్లిన సమయంలో నవదీప్ ఇంట్లోనే ఉండగా, అతనికే స్వయంగా నోటీసులు ఇచ్చారు.

రవితేజ షూటింగ్ లో ఉండగా, ఆయన ఇంటికెళ్లి దగ్గరి బంధువుకు విషయం చెప్పి, నోటీసులు ఇచ్చి, అవి అందినట్టు సంతకం తీసుకున్నారు. శ్రీనివాసరావు కూడా స్వయంగా నోటీసు అందుకున్నట్టు తెలుస్తోంది. తనీష్, నందులకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరని సమాచారం. వారికి నోటీసులను ఇచ్చేందుకు నేడు మరోసారి పోలీసులు వెళ్లనున్నారు. కాగా, స్వయంగా నోటీసులు అందుకున్న వారు మాత్రం తప్పనిసరిగా 19 నుంచి వారం రోజుల్లోపు సిట్ విచారణకు హాజరు కావాల్సిందే. మిగతా వారి ముందు మాత్రం మరో ఆప్షన్ ఉంటుంది. నోటీసులు ప్రత్యక్షంగా తీసుకోలేదు కాబట్టి, వారికి ఇంకొంత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.