Chiranjeevi-and-co-meeting-Jaganగడిచిన కొన్ని మాసాలుగా ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లే కనపడుతోంది. ప్రభుత్వ పరంగా ఎలాంటి మీడియా ప్రకటన గానీ, ప్రెస్ నోట్ గానీ విడుదల కాలేదు గానీ, మంత్రి పేర్ని నాని మాట్లాడిన విధానంతో త్వరలోనే పెద్ద సినిమాలకు కావాల్సిన టికెట్ ధరలు అమలయ్యే సూచనలు కనపడుతున్నాయి.

ఇంతకు నేడు జగన్ తో జరిగిన మీటింగ్ ఎలా జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అంటే… ముందుగా మాట్లాడిన మెగాస్టార్… సమావేశం అంతా మంచి వాతావరణంలో జరిగింది. అయిదవ షో కోసం అనుమతి అప్పటికప్పుడే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే టికెట్ ధరలకు సంబంధించి కొత్త జీవో ఈ నెలాఖరు లోపున ఓ ప్రకటన వచ్చే అవకాశము ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.

అలాగే ఈ సమస్య పరిష్కారంలో మంత్రి పేర్ని నాని తీసుకున్న చొరవ అభినందనీయమని, హైదరాబాద్ మాదిరే విశాఖలో కూడా షూటింగ్ నిర్వహించాలని సీఎం ఆకాంక్షించారని, దానికి కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం ఇస్తుందని సీఎం చెప్పారని, మున్ముందు ఏదైనా సమస్య వస్తే ఇలాగే సున్నితంగా చర్చలు జరుపుకుని పరిష్కరించుకుంటామని అన్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… గత అయిదారు నెలలుగా అందరం ఒక కన్ఫ్యూషన్ లో ఉన్నామని, ఈ సమస్య పరిష్కారానికి చిరంజీవి గారు తీసుకున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ కు థాంక్స్ చెప్పిన మహేష్, ఓ వారం, పది రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా దాదాపుగా మహేష్ చెప్పిందే రిపీట్ చేసారు. చిరంజీవి గారికి ఇండస్ట్రీ పెద్ద అనడం ఇష్టం ఉండదు గానీ, ఆయన పని చేసే విధానం పెద్ద అని నిరూపిస్తుందని జక్కన్న ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి గారు చిన్న సినిమాలు, పెద్ద సినిమాల ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడింది వినడం తనకెంతో నచ్చిందని రాజమౌళి అన్నారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకురావడంలో చిరంజీవి గారు తీసుకున్న శ్రద్ధ, అలాగే ఈ రోజు ఇక్కడి వరకు రావడానికి ఆయనే ముఖ్యకారణమని, ఇండస్ట్రీకి ఒక రిలీఫ్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినందుకు ఇండస్ట్రీ తరపున, ప్రభుత్వం తరపున కూడా మెగాస్టార్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు.

నా లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించి అయినా, సంబంధం లేకపోయినా అయినా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడినా, వాటన్నింటిని మనసులోనే పెట్టుకుని, ఇండస్ట్రీ కోసమే పాటుపడిన వ్యక్తిగా మెగాస్టార్ ను పేర్ని నాని కీర్తించారు. అందరూ సంతృప్తి చెందే విధంగా సీఎం వారందరికీ ఓ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు.

క్లుప్తంగా చెప్పాలంటే… ఈ సమావేశం లోపల ఏం మాట్లాడుకున్నారో పక్కన పెడితే, మీడియా ముఖంగా “ముఖ్యమంత్రికి ధన్యవాదాలు” తెలపడానికి ‘చిరు అండ్ కో’ హైదరాబాద్ నుండి తాడేపల్లి వచ్చినట్లుగా కనపడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే అంతే… అంతకు మించి ఏం లేదు. దీంతో ఇకనైనా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.