baahubali-and-srimanthudu-trp-ratingsవెండితెరను ఏలదామని 2015 సంవత్సరంలో చాలా మంది హీరోలే దండెత్తి వచ్చారు. అయితే సంక్రాంతికి విడుదలైన “గోపాల గోపాల” నుండి మొన్నటి “బెంగాల్ టైగర్” వరకు వచ్చిన సినిమాలలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోలు మాత్రం అతి కొద్ది మందే ఉన్నారు. గతంలో ‘నంది’ అవార్డుల పేరుతో ప్రతి ఏడాది ఉత్తమ నటులను ఎంపిక చేసి, సత్కరించుకునే ఆనవాయితీ ఉండేది. అయితే రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని మరిచిపోయాయి. కానీ కొందరి అద్వితీయమైన అభినయాలు సినీ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. ఆ జాబితాను పరిశీలిస్తే…

జూనియర్ ఎన్టీఆర్ (టెంపర్), అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి), ప్రభాస్ (బాహుబలి), మహేష్ బాబు (శ్రీమంతుడు), నాని (భలే భలే మగాడివోయ్) చిత్రాల ద్వారా 2015 ‘ఉత్తమ నటుడు’ రేసులో ఉన్నారు. గత చిత్రాలతో పోల్చుకుంటే, జూనియర్ ‘టెంపర్’ చిత్రంలో కాస్త వినూత్నంగా నటించారు. విమర్శకుల మెప్పు పొందినప్పటికీ, అప్పటికే పూరీ తీసిన ‘బిజినెస్ మెన్’లో మహేష్ తరహా హావభావాలు కనపడ్డాయని బహిరంగంగా వ్యాఖ్యానించారు. బుడ్డోడు కెరీర్ లో ‘ఉత్తమ నటన’ ప్రదర్శించాడేమో గానీ, ఈ ఏడాదికి ‘బుద్దోడు’ ఒక్కడే అని మాత్రం ధృవీకరించలేని పరిస్థితి నెలకొంది.

‘పరుగు’ సినిమా తర్వాత కాస్త పరిపక్వత గల పాత్రలో మెరిసాడు బన్నీ. ‘సన్నాఫ్ సత్యమూర్తి.’ సినిమాలో వున్న ఒకటి, రెండు హార్ట్ టచింగ్ సీన్స్ లో అల్లు వారబ్బాయి ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి గానీ, మొత్తమ్మీద నూటికి నూరు శాతాన్ని దక్కించుకోలేకపోయారు. ఇక, యావత్తు ఇండియన్ చిత్ర పరిశ్రమ ఎదురు చూసిన “బాహుబలి” చిత్రంలో ప్రభాస్ నటన విమర్శల పాలయ్యింది. సీన్ కు సీన్ కు ప్రభాస్ ఇచ్చిన హావభావాలు విమర్శకులను మెప్పించలేకపోయింది. ముఖ్యంగా సినిమా తొలి భాగంలో ప్రభాస్ నటన తేలిపోయిందని అభిమానులే బహిరంగంగా వ్యాఖ్యానించారు.

ఇక, “శ్రీమంతుడు” చిత్రం ద్వారా మహేష్ కనబరిచిన ప్రదర్శన విమర్శలను మెప్పించింది. అయితే ఇదే తరహా అభినయం ‘అతడు’ చిత్రంలో ప్రదర్శించారు. ‘సెటిల్డ్’ యాక్షన్ చేయడంలో మరొకరు సాటిరారనే విధంగా నటించి ప్రేక్షకుల చేత నీరజానం పలికించుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి రేసులో ఉన్న హీరోలలో అగ్రస్థానం మహేష్ బాబుదే. అలాగే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నాని ప్రదర్శించిన ‘మతిమరుపు’ నటన కూడా విమర్శకులను మెప్పించింది. వర్ధమాన హీరోలలో వెండితెరపై మంచి అభినయం కనపరిచే నాని కూడా 2015 ‘ఉత్తమ నటుడు’ విభాగంలో పోటీలో ఉన్నారు.

అభిమానుల అభిప్రాయాలను పక్కన పెట్టి, విమర్శకుల ప్రశంసల రీత్యా చూస్తే… 365 రోజుల్లో కేవలం అయిదుగురు హీరోలు మాత్రమే వుండడం తెలుగు సినీ పరిశ్రమ దీన స్థితిని చెప్తోంది. మరి ఈ అయిదుగురిలో నెంబర్ “1” ఎవరంటారూ..?!