Tollywood actress Hema writing degreee examsవిద్యార్హతలు పెంచుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని అనుకున్నారో ఏమో నటి హేమ డిగ్రీ అర్హత పరీక్ష రాయడానికి కూర్చున్నారు. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో పరీక్ష రాశారు. మాస్క్ శానిటైజర్ తో ఎక్సమ్ సెంటర్ కు వచ్చిన ఆమె జాగ్రత్తగా పరీక్ష రాశారు.

పరీక్షానంతరం మీడియాతో మాట్లాడిన ఆమె…. ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని, హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్లగొండలో పరీక్ష రాసినట్టు తెలిపారు. ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని, నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితరాలు ఉండటంతో ఇక్కడ పరీక్ష రాసినట్టు చెప్పారు.

పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని… డిగ్రీ తప్పకుండా పూర్తి చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి ఆమె నల్గొండ సెంటర్ గా ఎంచుకున్నా అక్కడ కూడా చాలా మంది ఆమెను గుర్తుపట్టి ఆమె చుట్టూ చేరారు. అయితే కరోనా కారణంగా కొంతమంది తోనే మాట్లాడి అక్కడ నుండి వెళ్లిపోయారు.

సినిమాలో మంచి నటిగా గుర్తింపు పొందిన హేమ… 2014లో రాజకీయాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరినా రాజకీయాలలో పెద్దగా యాక్టీవ్ గా లేరు.