Tollywood actors in 2019 electionsప్రతి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోల చూపులు ఎటు వైపు, ఎవరెవరికి సహకారం అందిస్తారనే విషయం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ సారి కూడా అందుకు విరుద్ధంగా ఏమీ జరగదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ జనసేన కూడా బరిలో ఉండడంతో సినీ ఇండస్ట్రీ ప్రాముఖ్యత మరింత పెరిగినట్లయ్యింది.

ఎన్నికలకు ఇంకా దాదాపుగా ఒక ఏడాది సమయం ఉన్న నేపధ్యంలో… ఇప్పుడే ఎవరెవరు ఎటు ఉంటారనేది చెప్పలేం గానీ, వారి వారి ఫ్లాష్ బ్యాక్ లు… గత కొన్నాళ్ళుగా అనుసరిస్తున్న తీరుతో… ఎవరెవరూ ఎటు వైపు ఉంటారో చెప్పేయొచ్చు. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ కుటుంబాల సహకారం గురించి పరిశీలిస్తే…

ముందుగా మెగా ఫ్యామిలీ… ఈ సారి ‘జనసేన’ బరిలో ఉంది గనుక, మెగా ఫ్యామిలీ అంతా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కు బేషరతుగా మద్దతు పలుకుతారని చెప్పడంలో సందేహం లేదు. చివరికి వచ్చేసరికి దాదాపుగా అందరి ప్రముఖ హీరోలు ప్రత్యక్షంగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మెగా అంతా ఒక్క తాటిపైకి వచ్చి ‘జనసేన’కు అండగా ఉండనున్నారు. ఇది క్లియర్.

నందమూరి కుటుంబానికి వస్తే… ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న బాలకృష్ణ ఎలాగూ టిడిపి ఎమ్మెల్యే గనుక ఇందులో మరొక ఆలోచనకు తావు లేదు. బాలయ్య తర్వాత నందమూరి వంశంలో అంతటి ప్రజాధరణ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. గత ఎన్నికలలో పరోక్షంగా వైసీపీ సహకారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్న తారక్, ఈ సారి పూర్తిగా సైలెంట్ అయ్యే ఆస్కారాలు కనపడుతున్నాయి. అటు వైసీపీకి గానీ, ఇటు టిడిపికి గానీ మద్దతు పలికే అవకాశాలు ప్రస్తుతమున్న పరిస్థితులలో లేవు. ఇంకా ఏడాది సమయం ఉంది గనుక, ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఘట్టమనేని కుటుంబంలో పార్టీల చీలిక స్పష్టం. గత ఎన్నికలలో గల్లా జయదేవ్ కు సహకరించాలని మహేష్ వేసిన ట్వీట్ పరోక్షంగా టిడిపికి కలిసివచ్చింది. ఈ సారి కూడా అదే కొనసాగే అవకాశాలు ఉన్నాయి తప్ప బహిరంగంగా మహేష్ నుండి ఏ పార్టీకి కూడా అనుకూలంగా ప్రకటన ఉండబోదు. ఇందులో కూడా ఫుల్ క్లారిటీ ఉంది. అయితే సూపర్ కృష్ణ మరియు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే ఆస్కారం కనపడుతోంది.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు ఏర్పరచుకునే అక్కినేని నాగార్జున కుటుంబం, గత ఎన్నికలలో పరోక్షంగా వైసీపీకి మద్దతు పలికింది. ఈ సారి పరిణామాలు కూడా అందుకు విరుద్ధంగా ఏమీ ఉండబోవు. బహిరంగంగా ఏ పార్టీకి మద్దతు తెలుపకపోయినా, అంతర్లీనంగా నాగ్ చూపులు వైసీపీ వైపుకే ఉంటాయన్నది ఇండస్ట్రీ టాక్. యువతరం హీరోలుగా నాగ్ తనయులిద్దరూ నాగచైతన్య, అఖిల్ లు ఇలాంటి రాజకీయ ప్రకటనలకు విరుద్ధం.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ రీత్యా… కృష్ణంరాజు బిజెపిలో కీలకపాత్ర పోషించనున్న నేపధ్యంలో… ప్రభాస్ చేత ఎలాగైనా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కేంద్రం పావులు కదుపుతోందన్నది బహిరంగమే. ఇది జరిగినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కృష్ణంరాజు బరిలో ఉంటారు గనుక ప్రభాస్ ‘కమలం’ జెండా పట్టుకోవచ్చన్నది ప్రజెంట్ టాక్. ఈ విషయంలో స్పష్టత లేదు గానీ, ‘బాహుబలి’ క్రేజ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకునే ఉద్దేశంలో బిజెపి అడుగులు వేస్తోందన్నది వాస్తవం.

ఫ్లాష్ బ్యాక్ లో విక్టరీ వెంకటేష్ కుటుంబం టిడిపికి సహకారం అందించగా, వచ్చే ఎన్నికలలో పూర్తిగా సైలెంట్ కానుంది. మిగిలిన కుటుంబాలలో మంచు ఫ్యామిలీ నుండి వైసీపీకి మద్దతు లభించనుందని సమాచారం. అలాగే టాలీవుడ్ లో ఇతర క్రేజీ హీరోలతో పాటు పలువురు ప్రముఖుల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నాలు వైసీపీ గట్టిగానే చేస్తోందని తెలుస్తోంది. ఫైనల్ గా టాలీవుడ్ నుండి ఈ సారి ఎక్కువ మద్దతు వైసీపీకి, తర్వాత స్థానంలో జనసేనకు, చివరి స్థానంలో టిడిపికి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.