today released movie talkఈ ఏడాది జనవరి 1వ తేదీన విడుదలైన “నేను.. శైలజ…” చిత్రం ఇచ్చిన ఊపును సంక్రాంతి పండుగకు విడుదలైన నాలుగు సినిమాలు కూడా కొనసాగించాయి. ఈ క్రమంలో ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర మూడు, నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. దీంతో ఈ రోజు మూడు సినిమాలు తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించాయి.

వరుసగా మూడు సినిమాలు హిట్టై టాలీవుడ్ లో హిట్ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ నాలుగవ చిత్రంగా విడుదలైన “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే టాక్ వెలువడింది. జగపతిబాబు ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా ఛాయలు కనపడ్డాయని వీక్షకులు విమర్శిస్తున్నారు.

ఇక హీరోగా రాజ్ తరుణ్ ఎంత విజయవంతమయ్యారో, హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కూడా అలాగే దూసుకెళ్తోంది. దీంతో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన “లచ్చిందేవికి ఓ లెక్కుంది” సినిమా కేవలం మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమాను జనరంజకంగా మలచడంలో కొత్త దర్శకుడు విఫలమయ్యాడని విశ్లేషకులు డిక్లేర్ చేసారు.

“కళావతి” రూపంలో మరో తమిళ బొమ్మ తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా నవ్వుల పాలైందనే టాక్ వెలువడింది. త్రిష, హన్సిక వంటి టాప్ హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అయితే ఆశించిన భయాన్ని గానీ, కామెడీని గానీ ఈ సినిమా ఇవ్వలేకపోవడంతో నిరుత్సాహపడడం ప్రేక్షకుల వంతయ్యింది.

ఈ మూడు తెలుగు చిత్రాలతో పాటు, సన్నీలియోన్ డ్యూయల్ రోల్ లో నటించిన “మస్తీజాదే” హిందీ చిత్రం కూడా వినోదాన్ని పంచడంలో విఫలమైనట్లుగా విశ్లేషకులు తేల్చేసారు. దీంతో ఈ రోజు ట్రేడ్ వర్గాలకు తీవ్ర నిరుత్సాహమే ఎదురయ్యింది. మరో వైపు ప్రేక్షకులకు సంక్రాంతి సినిమాలే మళ్ళీ దిక్కయ్యాయి.