TJS Kodandram not satisfied with seat sharingతెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు చెందిన తెలంగాణ జనసమితి మహాకూటమి వల్ల తాము తీవ్రంగా నష్టపోయాం అని భావిస్తుంది. మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తామని చెప్పిన ఆ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు తర్వాత పదిహేడు స్థానాలు కోరింది. పదకుండు స్థానాలపై గట్టి పట్టు పట్టింది.చివరికి ఎనిమిదికి తగ్గింది.కాని చివరికి దక్కింది నాలుగు సీట్లే. మరో నాలుగు సీట్లలో స్నేహపూర్వకపోటీలకు కాంగ్రెస్ సిద్దం అయింది. దీనితో కోదండరామ్ పార్టీ నికరంగా పోటీ చేస్తున్నది కేవలం నాలుగంటే నాలుగు సీట్లే.

మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్దిపేట స్థానాలు గాక అంబర్‌పేట్‌లో కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయించి టీజేఎస్‌కు ఇచ్చింది. వరంగల్‌ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్‌ స్థానాలను కూడా ఇవ్వాలని కోదండరాం కోరినా కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయలేదు. మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, చెన్నూ రు, అశ్వరావుపేట్, మెదక్‌ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి టీజేఎస్‌ ప్రతిపాదించినా కాం గ్రెస్‌ ససేమిరా అనడంతో కోదండరామ్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్‌ వైఖరి పట్ల టీజేఎస్‌ తీవ్ర అసహనంతో ఉంది. చివరికి మిగిలింది నాలుగు టిక్కెట్లు అని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. అయితే ఇంతవరకు వచ్చాక వెనక్కు వేళే అవకాశం లేకపోవడంతో కూటమికి మద్దతు కొనసాగించాలని కోదండరామ్ నిర్ణయించారు. ఈరోజు సోనియా గాంధీ సభకు కూడా వెళ్ళడానికే ఆ పార్టీ నిర్ణయించింది. కనీసం ఎన్నికల తరువాత గెలిచాకైనా తమను తగిన విధంగా గౌరవిస్తుందని వారు భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ తెలంగాణ జన సమితికి అన్యాయం చేసిందా అంటే రెండు రకాలుగా చూడాలి. నైతికంగా ఆలోచిస్తే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన కోదండరామ్ ను కాంగ్రెస్ సరిగ్గా గౌరవించలేదు అనే చెప్పుకోవాలి. అయితే గెలుపు కీలకమైన ఈ తరుణంలో ఎటువంటి పార్టీ నిర్మాణం లేని ఆ పార్టీకి సీట్లు ఇవ్వడమంటే తెరాసకు బంగారు పళ్లెం లో పెట్టి అప్పజెప్పినట్టే. ఆ పార్టీకి గుర్తు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకనే లభించింది. ఈ తరుణంలో కాంగ్రెస్ కోదండరామ్ కు మొండి చెయ్యి చూపించక తప్పలేదు.