Tirupati-TDP-Leaders-Protest-Jagan-Brand-Liquor-తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికార వైసీపీ నేతలు ప్రజల గడప తొక్కలేని పరిస్థితి కల్పిస్తున్నారంటే అతిశయోక్తికాదు. తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రం మండలంలోని కుప్పారెడ్డిపాళెంలో టిడిపి సూళ్ళూరుపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జి నెలవాల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అధ్వర్యంలో ఆదివారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాల గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆనాడు మా టిడిపి ప్రభుత్వం ఇచ్చినంత కూడా ఇవ్వడంలేదు. మా ప్రభుత్వం హయాంలో పేద కుటుంబాలలో సంపాదించే వ్యక్తి చనిపోతే రూ.2 నుంచి 5 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించేది. కానీ జగన్ ప్రభుత్వం ఆ పధకం అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ అవసరమైనవారిని ఆదుకోవడం లేదు. ఇటీవల కుప్పారెడ్డిపాళెంలో ఓ నిరుపేద యువకుడు పిడుగుపడి చనిపోతే ప్రభుత్వం అతని కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు,” అని అన్నారు.

టిడిపి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ విజేత మాట్లాడుతూ, “నేను చూశాను… విన్నాను… ఉన్నాను… అంటూ కబుర్లు చెప్పే జగన్, తన ప్రభుత్వం సరఫరా చేస్తున్న కల్తీ మద్యం త్రాగి జనాలు చనిపోతుంటే ఏమి చేస్తున్నారు? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. కనుక రాష్ట్రంలో మహిళలు తమ పసుపుకుంకుమలు కాపాడుకోవాలంటే తమ భర్తలను జె-బ్రాండ్ కల్తీ మద్యం తాగకుండా అడ్డుకొని వారి ప్రాణాలు కాపాడుకోవాలి,” అని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పీటీసీ శ్రీహరి రెడ్డి, టిడిపి నాయకులు శ్రీనివాసులు రెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణమూర్తి, మల్లెయ్య, కిషోర్ నాయుడు, సంచి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.