tirumala-hundi-full-big-notes-banకలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం రోజు లక్షల సంఖ్యలో భక్తులు బారులు తీరుతారన్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రజల వద్ద ఎక్కడా చిల్లర లేకపోవడంతో… ప్రస్తుతం ఈ ఆలయంలో రద్దీ అనే మాటకు ఆస్కారం లేకుండా పోయింది. సాధారణంగా పోలిస్తే భక్తుల రద్దీ దాదాపుగా 30 శాతం వరకు తగ్గిపోయినట్లుగా ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, విశేషమైన సంఖ్యలో భక్తులు తగ్గిపోయినప్పటికీ, ఆలయ హుండీలు మాత్రం ఫుల్ అవుతుండడం విశేషం.

దీని వెనుక ఉన్న ప్రత్యేకమైన కారణం ఏమీ లేదన్న విషయం తెలిసిందే. రద్దయిన పాత నోట్లతో నిమిత్తం లేకుండా హుండీలో ఎలాంటి నోట్లనైనా తిరుమల ఆలయ అధికారులు అనుమతిస్తుండడంతో, సాధారణ భక్తులతో పాటు నల్లధనం రాయుళ్ళు కూడా స్వామి వారి హుండీలను నింపే బాధ్యతను భుజాన వేసుకున్నట్లుగా అర్ధమవుతోంది. పాత నోట్లు లెక్కకు మించి వస్తుండడంతో లెక్కించడం తలకు మించిన భారంగా మారిందని టిటిడి ఉద్యోగస్తులే చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.

హుండీలలో వేసే మొత్తానికి కేంద్రం ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడంతో బ్లాక్ మనీ కొంతమేర దేవుళ్ళ దగ్గరకు చేరుతుందని ముందుగానే అంచనా వేసారు. దానికి తగిన విధంగా కలియుగ దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పాత వెయ్యి, అయిదు వందల నోట్లతో బారులు తీరినట్లుగా అర్ధమవుతోంది. అంతేలే… అందరినీ కాపాడేవాడు… ఆ దేవుడే కదా…! వాళ్ళు బ్లాక్ మనీ రాయుళ్ళు అయినా గానీ..!