Tirumala Chief Priest Ramana Deekshitulu reveals secrets on tirumalaదేవదేవుడు కొలువైన తిరుమల గిరుల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. బ్రహ్మాండ నాయకుడు స్వయంభువుగా అవతరించిన పుణ్యప్రదేశంగా, నిత్యమూ లక్షలాది భక్తుల కోరికలు తీరుస్తుండే శ్రీ వెంకటేశ్వరుడిని రహస్యంగా దేవాదిదేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెళుతుంటారని నమ్ముతుంటాం. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ, ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ తిరుమలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించగా, భక్తులకు ఊహకందని విషయాలను రమణ దీక్షితులు వివరించారు.

తిరుమల కొండల్లో శ్వేత ద్వీపం ఉందని, ఇక్కడ యోగులు, సిద్ధులతో పాటు ధవళ వస్త్ర ధారులైన దేవతలు ఉంటారని, వారు అక్కడి నుంచి స్వామివారి ఆలయంలోకి ఓ రహస్య మార్గం గుండా వచ్చి పోతుంటారని ఎన్నో పురాణాల్లో ఉందని అన్నారు. పవళింపు సేవ తరువాత, సుప్రభాత సేవకు ముందు అసంఖ్యాకంగా దేవతలు స్వామిని సేవించేందుకు వస్తారని, సుప్రభాతం తరువాత, స్వామి వారి గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించే వేళ, వారి భుజాలను తాకుతూ దేవతలు బయటకు వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు. అష్టాదశ పురాణాల సారమైన వెంకటాచల మహత్యంలో ఈ వివరాలన్నింటి గురించి చెప్పబడి వుందని అన్నారు.

శ్వేత ద్వీపానికి చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని పవిత్ర స్థలాల్లో రహస్య మార్గాలు ఉన్నాయని, సిద్ధ పురుషులు, యోగులు, దేవతలు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తూ, బాహ్య ప్రపంచంలోకి వచ్చి లోక కల్యాణం కోసం కొన్ని కార్యాలు చేస్తుంటారని వెల్లడించారు. ఉత్తర ఈశాన్య ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఓ గుహా ముఖం ఉందని, అదే శ్వేతద్వీపానికి శేషాచలం కొండల నుంచి రహస్య మార్గమని సూచనగా చెప్పబడుతోందని రమణ దీక్షితులు అన్నారు. ఈ శ్వేతద్వీపంలో రత్నఖచిత సింహాసనంపై ఓ మహాపురుషుడు ఆశీసులై ఉండి, ఇరువైపులా దేవేరులతో కొలువై ఉంటారని పేర్కొన్నారు.