Tiger Nageswara Rao First Lookమాములుగా ఏదైనా ఊరు ఫలానా స్వీట్లకో బట్టలకో ఫేమస్ కావడం చూశాం. కానీ దొంగతనాలకు ప్రసిద్ధి చెందడం మాత్రం అత్యంత అరుదు. అలాంటిదే స్టువర్ట్ పురం. ఇది బాపట్లకు దగ్గరలో ఉంటుంది. బ్రిటిష్ పాలనలో 1913 సంవత్సరం మదరాసు ప్రెసిడెన్సీ మెంబెర్ హెరాల్డ్ స్టువర్ట్ పునరావాసం కలిగించి దొంగల్లో మార్పు తెచ్చే ఉద్దేశంతో వాళ్ళందరిని ఈ ప్రాంతానికి తరలించేవారు. సంస్కరణకు పూనుకున్నాడు కాబట్టి స్టువర్ట్ పేరే ఆ గ్రామానికి పెట్టేశారు. ఎక్కడ చోరీలు జరిగినా పోలీసులు అక్కడికెళ్లి ఆరా తీసేవారు

స్వాతంత్రం వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత 1970 నుంచి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని పోలీసులను వణికించాడు. ఇతను బాగా డబ్బున్న వాళ్ళను దోచి పేదలకు పంచేవాడని పాతతరం వాళ్ళు కథలుగా చెప్పేవాళ్ళు. ఎన్ని వ్యూహాలు పన్నినా తప్పించుకునేవాడు. అతని ఎత్తుగడలు తలలు పండిన అధికారులకు ముచ్చెమటలు పట్టించేవి. 1974 కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఓ బ్యాంక్ దోపిడీకి తెగబడ్డ నాగేశ్వరరావు పధ్నాలుగు కిలోల బంగారంతో పాటు యాభై వేలకు పైగా డబ్బును తీసుకెళ్లిపోయాడని రికార్డులో ఉంది.

ఇలా ఎంతో నేర చరిత్ర కలిగిన ఇతని మీద బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో ఉపకథలు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపిస్తారో లేదో తెలియదు. నిజానికీ సబ్జెక్టుతో మూడేళ్ళ క్రితం రానా హీరోగా తీయాలని ప్రయత్నాలు జరిగాయి. అతని అనారోగ్యం వల్ల ఫలించలేదు. ఆ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ముచ్చట పడ్డాడు. కొంత వివాదం కూడా రేగింది. ఆఖరికి రవితేజ పంచన చేరింది. తెలుగు సీమ రాబిన్ హుడ్ గా పిలవబడ్డ నాగేశ్వరరావుని ఎందుకు హీరోగా మార్చారనే నేపథ్యం సహజంగానే ఆసక్త్ రేపుతోంది

ఈ బ్యాక్ డ్రాప్ తో 1991లో రెండు సినిమాలు వచ్చాయి. చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో కెఎస్ రామరావు స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజై దారుణమైన డిజాస్టర్ అందుకుంది. దీనికి సరిగ్గా వారం ముందు భానుచందర్, దగ్గుబాటి రాజా ప్రధాన పాత్రలో సాగర్ డైరెక్షన్ లో స్టువర్ట్ పురం దొంగలు వచ్చింది. ఇది మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో ఈ క్లాష్ గురించి చిరు మూవీ పోవడం గురించి కథనాలొచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రవితేజ స్టువర్ట్ పురం దొంగగా వస్తున్నాడు.