Tier 2 Star Heroesఏ హీరో అయినా ప్రతి సంవత్సరం హిట్లు ఉండాలనే కోరుకుంటాడు. టాప్ స్టార్లు ప్యాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకుని ఎదగాలని చూస్తుంటే మీడియం రేంజ్ హీరోలు టైర్ 1 లెవెల్ కు వెళ్లాలని ఆశపడుతున్నారు. ఇది నెరవేరడం అంత సులభం కాకపోయినా ముందు చేతిలో ఉన్న మార్కెట్ ని కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. నటనతో పాటు నిర్మాణం, ఇతర వ్యాపారాలను బ్యాలన్స్ చేసే క్రమంలో ఫ్లాపులు తప్పటడుగులు పడుతుంటాయి. న్యాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే 2022లో అంటే సుందరానికి మిగిల్చిన చేదు అనుభవం ఫ్యాన్స్ ఊహించనిది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న మూవీ జనానికి చేరలేదు.

అలా అని అదేమీ బాలేని సినిమా కాదు. ఓటిటిలో వచ్చాక కుటుంబ ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. లెన్త్ విషయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రాజీ పడి ఉంటే బాగుండేదని అప్పుడు మీడియా వ్యక్తం చేసిన అభిప్రాయమే ఇప్పుడు ఆన్ లైన్ లో చూసినవాళ్లు చెబుతున్నారు. దీని సంగతి పక్కనపెడితే నానికి నిర్మాతగా హిట్ 2 చాలా ప్లస్ అయ్యింది. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి లాభాలు వెనకేసుకోవడమే కాదు హిట్ 3కి కావాల్సిన బజ్ ని, తనే హీరోగా నటించాల్సిన రేంజ్ ని ఆ ఫ్రాంచైజ్ కి తెప్పించేశాడు. ఇంకో మూడు నెలల్లో రాబోతున్న దసరాకు బిజినెస్ బాగా జరగడానికి కారణం మినిమమ్ గ్యారెంటీ బ్రాండ్ ఇంకా భద్రంగా ఉండటమే.

ఏది తోస్తే అది మాట్లాడితే అదే యాటిట్యూడ్ అనుకునే విజయ్ దేవరకొండకు లైగర్ ఇచ్చిన షాక్ చిన్నది కాదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం టైంలో వచ్చిన మార్కెట్, ఫాలోయింగ్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లు సినిమాలు బాలేకపోయినా వాటి కంటెంట్ కన్నా ఓవర్ హైప్ వల్ల జరిగిన డ్యామేజ్ ఎక్కువ. అటు ప్రొడ్యూసర్ గానూ రౌడీ బాయ్ కు ఏమంత ఆశాజనకంగా లేదు. తమ్ముడిని హీరోగా పెట్టి తీసినవి డిజిటల్ గా ఏదో పాసయ్యాయి కానీ థియేటర్లలో ఎవరూ చూడలేదు. అటు దుస్తుల బిజినెస్ కూడా మెల్లగా అటకెక్కింది. ఆపేయలేదు కానీ రౌడీ బ్రాండ్ కు మునుపు ఉన్నంత జోష్ అయితే లేదు.

ఇక ఇస్మార్ట్ శంకర్ తో తనకు తిరుగు లేని మాస్ ఇమేజ్ వచ్చిందని భ్రమపడ్డ ఎనర్జిటిక్ స్టార్ రామ్ అసలు ఏ నమ్మకంతో ఫేడ్ అవుట్ అయిన లింగుస్వామిని నమ్మి ది వారియర్ ని చేశాడో ఇప్పటికీ అర్థం కానీ బ్రహ్మరహస్యం. ఊరికే విన్నా రొట్ట రొటీన్ అనిపించే సబ్జెక్టుని కేవలం తన ఇమేజ్ కాపాడుతుందనే అంచనా పూర్తిగా అడ్డం తిరిగింది. ఫలితం డిజాస్టర్. అంతకు ముందు రెడ్ కూడా యావరేజే. అలా అని రూట్ ఏమి మార్చలేదు. కాకపోతే బోయపాటి శీను చేతిలో పడ్డాడు కాబట్టి ఏ భద్రనో తులసి లాంటిదో పడితే మంచిదే. నాగచైతన్యకు బంగార్రాజు ఇచ్చిన కాసింత ఆనందం లాల్ సింగ్ చద్దా, థాంక్ యులు పూర్తిగా నీరుగార్చేశాయి. అరవ దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీతో గట్టెక్కించాలి. మొత్తంగా చూస్తే టైర్ 2 హీరోల గ్రాఫ్ లు ఎగుడుకంటే దిగుడుగానే ఎక్కువ కనిపిస్తున్నాయి.