Tier 2 Heroes Exciting Challengesఒకప్పుడు స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయినా సరే జనాలకు థియేటర్ లేదా టీవీ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు కాబట్టి ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్లు బాగా వచ్చేవి. అందుకే కొన్ని డిజాస్టర్లు సైతం యాభై వంద రోజులు ఆడిన దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడలా కాదు. నువ్వెంత తోపైనా సరే కంటెంట్ ఏ మాత్రం తేడా కొట్టిందా సాయంత్రం షోకి ఆడియన్స్ పల్చబడిపోయి డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటూ నిర్మాతలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు ఇది మరీ చేయి దాటిపోయి బయ్యర్లు ధర్నాలు చేసే దాకా వెళ్లిన ఉదంతాలు లేకపోలేదు. వంద కోట్ల మార్కెట్ ఉన్న పైస్థాయి హీరోలకు సమస్య లేదు కానీ ఎటొచ్చి టైర్ 2 కథానాయకులకు మాత్రం ఇబ్బందే.

నాని

ముందుగా నాని సంగతే తీసుకుంటే ఎప్పుడో 2015లో భలే భలే మగాడివోయ్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాధించాక మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడటం పెద్ద సవాల్ అయిపోయింది. సబ్జెక్టు సెలక్షన్ లో ఎంత వైవిధ్యం చూపించాలని ప్రయత్నిస్తున్నా దర్శకుల వల్ల నష్టపోతున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. వి, టక్ జగదీష్ లు ఓటిటిలోనే తిరస్కారానికి గురయ్యాయి. శ్యామ్ సింగ రాయ్ బ్రేక్ ఈవెన్ కోణంలో హిట్టని చెప్పుకున్నారు కానీ నిజానికి న్యాచురల్ స్టార్ ఆశించిన దానికన్నా తక్కువ ఫలితమే దక్కింది. ఇక అంటే సుందరానికి ప్రెజెంటేషన్ ప్రాబ్లమ్ తో పాటు లెన్త్ విషయంలో వివేక్ ఆత్రేయ మొండిపట్టు దానికి చేసిన డ్యామేజ్ ఎక్కువే. అందుకే పుష్ప స్టైల్ లో దసరాతో ఊర మాస్ లోకి దిగిపోయాడు నాని. ఇది ఆడిందా సరే. కాకపోతే జనాలు తనను ఇంత రఫ్ మేకోవర్ లో రిసీవ్ చేసుకుంటారా లేదా చూడాలి.

దేవరకొండ

విజయ్ దేవరకొండ గురించి అభిమానులే బాధే పడే పరిస్థితి తలెత్తుతోంది. పబ్లిక్ స్టేజిల మీద మాటల్లో చూపిస్తున్న కాన్ఫిడెన్స్ ఎంచుకుంటున్న కథల్లో లేదు. తన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ కి వీరాభిమానులు ఉన్నారు కాబట్టి అలా కనిపిస్తేనే సినిమా హిట్టవుతుందనే భ్రమ నుంచి బయటికి రాకపోతే పదే పదే వరల్డ్ ఫేమస్ లవర్ లు లైగర్ లు వస్తూనే ఉంటాయి. గీత గోవిందం తరహా ఫ్యామిలీ జానర్ ని కావాలని ఎందుకు దూరం పెడుతున్నాడో అంతు చిక్కని పరిస్థితి. ఒక స్టేజిలో సుకుమార్, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లు విజయ్ తో చేస్తారనే టాక్ నుంచి ఫ్లాపులొ ఉన్న శివనిర్వాణ ఖుషి ముందు హిట్ అయితే చాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు కావాల్సింది కెరీర్ కి బూస్ట్ ఇచ్చే బ్రేక్.

నాగచైతన్య

నాగచైతన్యది మరో కథ. సోగ్గాడే చిన్ని నాయనా బ్రాండ్ తో బంగార్రాజుని మార్కెటింగ్ చేసి ఎవరూ పోటీ లేని సంక్రాంతి సీజన్ లో హిట్టు కొట్టాడు కానీ తన అసలైన డొల్లతనం బయటపడింది థాంక్ యులోనే. హెవీ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్టులను ఎంచుకుంటే ఎంత మూల్యం చెల్లించాలో అర్థమయ్యింది. లవ్ స్టోరీకి సాయిపల్లవి, మజిలీకి సమంతా కంట్రిబ్యూషన్ ఉండటం వల్లే హిట్టయ్యాయన్న కామెంట్ కి బదులు చెప్పాలంటే చైతు బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సింది వెంకట్ ప్రభుతో చేస్తున్న మూవీతోనే. అరవ దర్శకులు మన హీరోలకు హ్యాండ్ ఇస్తున్న టైంని ఇదెలాంటి మలుపు ఇస్తుందో లెట్ వెయిట్ అండ్ సీ

రామ్

ఎనర్జీని హైలెవెల్ లో వాడే రామ్ కు ఇస్మార్ట్ శంకర్ ఎంత వరమైందో అంతే శాపమైంది. దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి మాస్ లో మరింత పట్టు సంపాదించాలనే తాపత్రయంతో వరసగా చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్లు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. రెడ్ చావు తప్పి కన్ను లొట్టపోయింది కానీ సంక్రాంతి కాకుండా ఇంకో టైంలో వచ్చి ఉంటే దెబ్బ పెద్దగానే పడేది. ఒక టి కొట్టు ఓనర్ కి వారియర్ కథ వినిపించినా ఇదేకాలంలో రాసుకున్నారు సార్ అని అడుగుతాడు. అలాంటిది కేవలం లింగుస్వామి బ్రాండ్ ని చూసి గుడ్డిగా ఓకే చెప్పడం డిజాస్టర్ ని కానుకగా ఇచ్చింది. తమిళంలోనే అందరూ లైట్ తీసుకున్న అతను తన దగ్గరికి వచ్చినపుడైనా ఆలోచించాలి కదా.

రిస్క్

వీళ్ళందరికీ ఉన్న రిస్క్ ఒకటే. వరస పరాజయాలు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గించినా తగ్గించకపోయినా మార్కెట్ మీద మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇవాళ ముప్పై కోట్లు ఉన్నది ఓ ఏడాది తర్వాత ఇరవైకి పడిపోతుంది. నిర్మాతలు బడ్జెట్లో కోతలు మొదలుపెడతారు. ఒకప్పుడు భారీ ఓపెనింగ్స్ తో దివ్యంగా వెలిగిన గోపీచంద్ కు ఇప్పుడు ఫస్ట్ డే ఫుల్ చేసుకోలేని స్థితి వచ్చింది. చిరునవ్వుతో టైంలో వేణు కూడా స్టార్ డంని ఎంజాయ్ చేశాడు. తర్వాత ఏమయ్యింది. సో టైర్ 2 నుంచి పైస్థాయికి ప్రమోషన్ కావాలంటే జాగ్రత్త పడాల్సింది కథలు దర్శకుల విషయంలో. అంతే తప్ప కాంబోల ఉచ్చులో పడి సరైన స్క్రిప్ట్ లు ఎంచుకోకపోతే మనమూ అనగనగా ఒక హీరో ఉండేవాడు లిస్టులో చేరిపోవాల్సి ఉంటుంది.