threats to YS Vivekananda Reddy Daughter Sunitha Reddyవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏ మాత్రం సజావుగా సాగడం లేదని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఢిల్లీలో సీబీఐ అధికారులను శుక్రవారం కలసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది సూచించారు,” అంటూ చెప్పుకొచ్చారు.

“నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. నేను రాజకీయ నాయకురాలని కాదు… సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి?,” అని ఆమె ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పదం గా మరణించాడు. ఈ విచారణ మరింత ఆలస్యమైతే.. మిగతా సాక్షులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పోరాటంలో మీ అందరు… అలాగే మీడియా వారు న్యాయం కోసం నాకు సహకరించాలి,” అని ఆమె కోరారు. ఇదివరకు హై కోర్టు కు సమర్పించిన అనుమానితుల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన వారు, వైఎస్ కు అనుయాయులు కూడా ఉండటం గమనార్హం.

బాబాయ్ హత్యను జగన్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? అని జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా … “నాకైతే సరైన సమాధానం దొరకడం లేదు. మీరు ఆయన్నే అడగాలి. ఇప్పటికే అనుమానితుల జాబితా హైకోర్టుకు ఇచ్ఛా. అందులో కొందరు మా చుట్టాలు కూడా ఉన్నారు,” అని ఆమె సమాధానం చెప్పారు.