Kishan Reddy - BJPకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కి బెదిరింపు కాల్స్‌ రావడంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి భద్రతను కూడా సమీక్షిస్తున్నారు. గత నెల 20న ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చాయని కిషన్‌రెడ్డి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్‌ నుంచి అజ్ఞాత వ్యక్తులు కాల్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెండో సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కిషన్ రెడ్డిని తన మంత్రివర్గంలోకి సహాయ మంత్రిగా తీసుకున్నారు. పదవి చేపట్టిన రెండో రోజే ఎంఐఎం టార్గెట్ గా కొన్ని విమర్శలు చేశారు ఆయన. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.

అప్పట్లో ఈ వ్యాఖ్యలపై ఓవైసీ విరుచుకుపడ్డారు. బాధ్యతగల మంత్రి ఇంత బాధ్యతారహితంగా మాట్లడటం ఏమిటంటూ నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలకు బెదిరింపు కాల్స్‌ కు ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్ లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికే బెదిరింపు కాల్స్ అంటే అది మాములు విషయం కాదు. ఢిల్లీ స్థాయిలో కూడా దీనిపై పోలీసుల మీద ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. దానితో ఈ కేసులో వారు ఏం చేస్తారో చూడాలి.