Thota Trimurthulu skipped chandrababu naidu meeting in east godavariఎన్నికల అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు బయలుదేరారు. తూర్పు గోదావరి జిల్లా నుండి మొదలు పెట్టి అన్ని జిల్లాలలో పార్టీ పరిస్థితిని సమీక్షించాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో తూర్పు లోనే ఆయనకు ఇబ్బంది ఎదురయ్యింది. సమీక్షా సమావేశానికి తోట త్రిమూర్తులు డుమ్మాకొట్టారు. ఆయన వద్దకు కొందరు దూతలను పంపినా లాభం లేకుండా పోయింది. గత కొంత కాలంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వినిపించాయి.

ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కూడా కలిశారని నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు నాలుగుసార్లు గెలుపొంది ఐదోసారి మొన్నటి ఎన్నికలలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తారని వార్తలు వచ్చినా అది జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల కృష్ణ చేతిలో పారాజయం పొందారు. వేణుగోపాల కృష్ణ 6,253 ఓట్ల మోజార్టీతో తోటపై గెలుపొందారు.

ఎన్నికలకు ముందు తోట త్రిమూర్తులు సోదరుడు తోట నరసింహం కుటుంబంతో సహా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. నరసింహం కుటుంబం వైసీపీలో చేరడంతో తోట వాణిని తమ పార్టీ పెద్దాపురం అభ్యర్థిగా బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి, అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప చేతిలో ఆమె ఓడిపోయారు. ఇప్పడు సోదరుడి బాటలోనే త్రిమూర్తులు నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ఇబ్బందికరంగా మారవచ్చు.