Thopudurthi Chandrasekhar Reddy “ఆనాడు మొద్దు శ్రీనుకి ఒక్క మాట చెప్పి ఉంటే అతను నేరుగా చంద్రబాబు నాయుడు ఇంట్లోనే దూరి ఆయనని హత్య చేసి ఉండేవాడు. హత్యా రాజకీయాలు చేయాలనుకొంటే నారా లోకేష్‌ ఫస్ట్ టార్గెట్.” ఈ మాటలు అన్నది మరెవరో కాదు అనంతపురం జిల్లా, రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు.

దీనిపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ మహిళా నేత పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్, వారి అనుచరులు అనంతపురం జిల్లా రాప్తాడులో పోలీస్ స్టేషన్‌ ఎదుట బైటాయించి ధర్నా చేస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడుని, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లను హత్య చేయిస్తామన్నట్లు మాట్లాడిన తోపుదుర్తి చందుని తక్షణం అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడుపై ఇప్పటికే ఒకటిరెండుసార్లు దాడులు జరిగాయని ఈ సందర్భంగా ఆమె పోలీసులకు గుర్తు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర చేయబోతున్నారని కనుక ఆయనపై దాడులు చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు తోపుదుర్తి చందు మాటలతో స్పష్టం అవుతోందని పరిటాల సునీత వాదించారు.

వైసీపీ నేతలు రాజకీయంగా టిడిపిని ఎదుర్కొలేకనే భౌతికదాడులకు, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని పరిటాల సునీత ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేస్తామని వైసీపీ నేత తోపుదుర్తి చందు ఇంత స్పష్టంగా చెపుతున్నప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతని మాటలకు నిరసన తెలిపిన టిడిపి నేత ఘంటాపురం జగ్గుని కొత్తపల్లి పోలీసులు ఏవిదంగా అరెస్ట్ చేశారని పరిటాల సునీత ప్రశ్నించారు. అతనికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన టిడిపి నేతల వాహనంపై ధర్మావరం సమీపంలో వైసీపీ నేతలు దాడి చేయడాన్ని పరిటాల సునీత తీవ్రంగా ఖండించారు. టిడిపి నేత ఘంటాపురం జగ్గుని తక్షణం బేషరతుగా విడిచి పెట్టి హత్యా రాజకీయాలు చేస్తామని బెదిరిస్తున్న తోపుదుర్తి చందుని అరెస్ట్ చేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.

గత టిడిపి ప్రభుత్వ హయంలో అంతర్జాతీయ లోదుస్తుల తయారీ కంపెనీ ‘జాకీ’ని రాప్తాడులో ఏర్పాటుచేసేందుకు అనుమతులు మంజూరు చేసిందని కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే రాప్తాడులో వైసీపీ నేతల వేధింపులు భరించలేక జాకీ కంపెనీ ప్రభుత్వానికి భూమి తిరిగి అప్పగించేసి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయిందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఆ అంశంపైనే ఇరు పార్టీల నేతల మద్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతూ చివరికి భౌతికదాడులు, హత్యా రాజకీయాల వరకు వచ్చాయి.