Jr NTRప్యాన్ ఇండియా సక్సెస్ లు వచ్చాక మన స్టార్ హీరోల ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ పెరిగింది. దీన్ని కాపాడుకునే క్రమంలో పడుతున్న అతిజాగ్రత్త వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ డేట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5కి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రెండు వారాల్లో ఏడు రోజులు సెలవులు వస్తాయనే పాజిటివ్ కోణం ఒకవైపు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నా ఇంకో పదిహేను నెలలకు పైగా ఎదురు చూడాలన్న కఠిన వాస్తవం డై హార్డ్ ఫ్యాన్స్ కు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఆ బాధ సబబే.

రాబోయే మార్చికి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. దీనికి అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవకు ఎంత గ్యాప్ ఉందో అందరికీ గుర్తే. ట్రిపులార్ క్రెడిట్ మొత్తం తారక్ కు రాలేదు. రామ్ చరణ్, రాజమౌళిలతో సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. పైగా పాత్ర నిడివి, క్యారెక్టరైజేషన్ పరంగా సెకండ్ హాఫ్ లో తగినంత న్యాయం జరగలేదనే ఫీలింగ్ ఇప్పటికీ అభిమానుల్లో లేకపోలేదు. అలాంటప్పుడు వాళ్ళను సంతృప్తి పరిచేందుకు వీలైనంత వేగంగా పరుగులు పెట్టాలి. తొందరపడితే డిజాస్టర్లు వస్తాయేమోననే భయం ఉండొచ్చు. మరి ప్రభాస్ అంత నెమ్మదిగా చేసినా సాహో, రాధే శ్యామ్ లు ఆడలేదుగా. కారణాలు చెప్పనవసరం లేదు.

అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఇమేజ్ ని ఇంకా పెంచుకునేందుకు జూనియర్ తాపత్రయం కనిపిస్తోంది. కానీ టైం కూడా అంతే ముఖ్యంగా కదా. ఇప్పుడీ ఎన్టీఆర్ 30 వచ్చేలోగా పుష్ప 2, సలార్, రామ్ చరణ్ 15, ఆది పురుష్ లాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్లన్నీ వచ్చేసి ఉంటాయి. అప్పుడు తారక్ వాటిని మించేలా తన సినిమా ఉందని రుజువు చేయగలిగితేనే అంత జాప్యానికి న్యాయం జరుగుతుంది. అసలు స్క్రిప్ట్ లాక్ చేయడానికి ఏడాది టైం తీసుకుని మళ్ళీ తీయడానికి అంతకన్నా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుంటేనే బ్లాక్ బస్టర్ దక్కుతుంది.

ఏది ఏమైనా యంగ్ టైగర్ ఆలోచనా ధోరణి ఈ నెమ్మదితనం ఎలాంటి ఫలితం ఇస్తుందోనని ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తున్న మాట వాస్తవం. వరసగా సినిమాలు చేస్తూ ఉంటే ఒకటి పోయినా దగ్గర్లో ఇంకొకటి ఉందనే ధైర్యం ఉంటుంది. ఆచార్య పోయినా శంకర్ మూవీ ఉందనే దీమా చరణ్ టీమ్ లో ఉంది. రాధే శ్యామ్ దెబ్బ కొట్టినా సలార్ తో సత్తా చూపిస్తామనే కాన్ఫిడెన్స్ డార్లింగ్ గ్యాంగ్ లో కనిపిస్తోంది. కానీ జూనియర్ దగ్గర అలాంటి సమాధానం ఎక్కడ. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ వెయిటింగ్ లో ఉన్నాడు. గెటప్పులు వేరే ఉంటాయి రెండు ఒకేసారి షూటింగ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ప్లానింగ్ విషయంలో లెక్క తప్పుతున్న తారక్ ఇవన్నీ సీరియస్ గా విశ్లేషించుకోవాల్సిందే.