Nani Dasara ఇంకో పన్నెండు రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని ఊర మాస్ అవతారంలో దసరాతో రాబోతున్నాడు. అయితే ఇదేదో ఆషామాషీగా చేయడం లేదు. పక్కా ప్లాన్ తో ఇది ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్ లో వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. ఓ కొత్త దర్శకుడిని నమ్మేసి ఇంతగా కష్టపడటం నిర్మాతలు కోట్లు కుమ్మరించడం చూస్తుంటే కథ మీద ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే ప్రధాన నగరాలు చుట్టేసిన నాని నెక్స్ట్ మరికొన్ని ప్లాన్ చేసుకుని రెడీ అవుతున్నాడు

ఇదంతా బాగానే ఉంది కానీ నాని ఆల్ ఇండియా ఎంట్రీకి ఇతర భాషల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండబోతున్నాయి. వాటికి ధీటుగా తట్టుకుని నిలబడితే పని సులభమవుతుంది. ముందు బాలీవుడ్ సంగతి చూస్తే అజయ్ దేవగన్ బోళా కవ్విస్తోంది. కార్తీ ఖైదీ రీమేక్ ని పూర్తిగా కమర్షియల్ ఫ్లేవర్ లోకి మార్చుకుని చాలా అదనపు హంగులు జోడించి త్రీడిలో రిలీజ్ చేస్తున్నారు. మనం చూసిన కథే కానీ నార్త్ ఆడియన్స్ కి కొత్త కాబట్టి పఠాన్ తర్వాత ఆ స్థాయి కాకపోయినా దృశ్యం 2ని మించి ఆడుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.

Also Read – వైసీపీ పాలిట అనకొండ లా మారిన బెజవాడ..!

తమిళం వైపు లుక్కేస్తే వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1ని ఒక రోజు ఆలస్యంగా మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. హాస్య నటుడు సూరి హీరో అయినప్పటికీ చాలా సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే ఈ కల్ట్ డైరెక్టర్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి చాలా కీలక పాత్ర పోషించాడు. తెలుగు డబ్బింగ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. 30నే శింబు పాతు తలాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇదీ హైప్ ఉన్నదే. ఇక కన్నడలో పుష్పలో రష్మిక మందన్నని కవ్వించే విలన్ గా నటించిన ధనుంజయ్ హీరోగా రూపొందిన హొయ్సల మీద పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోంది.

ఇవన్నీ ఆయా భాషల్లో నాని దసరాకు గట్టి పోటీ నిచ్ఛేవే. ఇవి చాలవన్నట్టుగా హాలీవుడ్ మూవీ డంగియాన్స్ అండ్ డ్రాగన్స్ కూడా అదే డేట్ కి వస్తోంది. వీటన్నిటికీ థియేటర్ల కేటాయింపు, షోల కౌంట్, టాకులు, రివ్యూలు చాలా కీలకంగా మారతాయి. ఏపీ తెలంగాణ వరకు నానికి టెన్షన్ లేదు. తెలుగుకు సంబంధించి సోలోగా దిగుతున్నాడు కాబట్టి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ పైన చెప్పినవన్నీ మిగిలిన రాష్ట్రాల్లో ఇబ్బంది పెడతాయి. వాటిని తట్టుకుని బొగ్గుగనుల ధరణి మాస్ చూపించాడంటే మరో ప్యాన్ ఇండియా హీరో నాని రూపంలో దొరికినట్టే.

Also Read – నీలి మీడియాకు రక్త కన్నీరే..!