There Modi and here Jagan fit perfectlyకరోనా సమయంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొంచెం ఉన్నవాడిని ప్రైవేట్ ఆసుపత్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయి లేని వాడికి అసలు బ్రతికే అర్హతే లేదు అంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల లేమి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటువంటి విపత్తు సమయంలో ప్రభుత్వాలు రాజకీయ కక్షలతో బిజీ అయిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఏకు మేకై కూర్చున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపింది జగన్ ప్రభుత్వం. తనపై కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించి సదరు ఎంపీ సంచలనం సృష్టించారు. ఇక పైన మోడీ వరుస కూడా ఇలాగే ఉంది. మందీమార్బలాన్ని మొత్తం దింపిన బెంగాల్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు మోడీ – అమిత్ షా.

రాజకీయ హింస అంటూ గవర్నర్ తో వార్నింగ్లు ఇప్పిస్తుంది. ఇప్పుడు నారదా స్కాం అంటూ ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన ఇద్దరు మంత్రుల్ని అదుపులోకి తీసుకుంది సిబిఐ. ఆ స్కామ్ లో నిందితులైన ఇద్దరు నాయకులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు… ఇటీవలే ఎన్నికల సమయం నుండి బెంగాల్ బీజేపీలో అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

అతితొందరలో బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని ఆ పార్టీ వారు బాహాటంగానే చెప్పడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇంతటి పెను విపత్తు ముంగిట ఉండగా… ఇలా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలే పరమావధిగా సాగిపోతున్న నేతలు కనీసం ప్రజలు చూస్తున్నారు అనే సోయ కూడా లేకుండాపోవడం దారుణం.