there is no use to janasena with BJPఇప్పుడు ఏపీలో జ‌న‌సేన చాలా బ‌లంగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. వాస్త‌వానికి ప‌వ‌న్ త‌ర‌ఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిచాడు. ప‌వ‌న్ కూడా రెండు చోట్లా ఓడిపోయాడు. అలాంటి పార్టీని చంద్ర‌బాబు, బీజేపీ ఇంత‌లా కావాల‌ని ఎందుకు అనుకుంటున్నారు అంటే.. జ‌న‌సేన‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేక‌పోయినా కూడా.. అంతో ఇంతో ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ద‌నే న‌మ్మ‌కంతోనే. ఆ పార్టీకి ఉన్న కొంత ప్ర‌భావాన్ని అనుకూలంగా మార్చుకోవ‌డం కోస‌మే.

ఇక ఏపీలో బీజేపీకి అస్స‌లు పెద్ద‌గా కేడ‌ర్ లేదు. పైగా ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా లేరు. ఇలాంటి స‌మ‌యంలోనే ఆ పార్టీకి ఏపీలో బ‌ల‌ప‌డాలంటే ఏదో ఒక పార్టీ అవ‌స‌రం ఉంది. ఎలాగూ టీడీపీ వ్య‌తిరేకించింది, వైసీపీ పొత్తుకు సిద్ధంగా లేదు కాబ‌ట్టి ఏ దిక్కు లేక చివ‌ర‌కు జ‌న‌సేన‌ను ఎంచుకుంది. జ‌న‌సేన‌ను ఆధారంగా చేసుకుని బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. అయితే ప్ర‌తి విష‌యంలో జ‌న‌సేన‌కు బీజేపీతో కొంత అన్యాయమే జ‌రుగుతోంద‌ని జ‌నసైనికులు మొద‌టి నుంచి బాధ‌ప‌డుతున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ప‌వ‌న్‌కు ఎలాంటి సాయం చేయ‌ట్లేద‌నే ఆవేద‌న వారిలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన ఎన్ ఆర్ ఐ సంఘాలు బీజేపీ మీద సోషల్ మీడియాలో వార్ మొద‌లు పెట్టాయి. బీజేపీతో దోస్తీ చేస్తే ఆ పార్టీకే లాభం జ‌రుగుతోందంటూ మొర పెట్టుకుంటున్నాయి. 2014లో టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో అధికారంలోకి వ‌చ్చింద‌ని గుర్తుచేస్తున్నాయి.

ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. ప్ర‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సీట్ల‌ను త్యాగం చేస్తోంద‌ని బీజేపీ పోటీ చేసినా గెల‌వ‌ట్లేదంటూ చెబుతున్నాయి. ఇంత చేసినా కూడా మొన్న ప‌వ‌న్ అడిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను ఆప‌లేదని, అంతే కాకుండా ఇప్పుడు భీమ్లానాయ‌క్ విష‌యంలో జీవో నెంబ‌ర్ 35 తో మంత్రి పేర్నినాని నానా ఇబ్బందులు పెడుతున్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉండి క‌నీసం కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక వార్నింగ్ కూడా ఇప్పించ‌లేక‌పోయిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఎన్ ఆర్ ఐ జ‌న‌సైనికులు.

ఇటు ఏపీలో ఉన్న జ‌నసేన కార్య‌క‌ర్త‌లు కూడా భీమ్లానాయ‌క్ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంత క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేస్తున్నాకూడా కేంద్రంలో ఉన్న బీజేపీ మౌనంగా ఉండ‌టం ఏంట‌ని ఆగ్ర‌హం తెలుపుతున్నారు. అస‌లు బీజేపీతో పొత్తు వ‌ల్ల జ‌న‌సేన‌కు ఒరిగిందేమీ లేదంటే అటు ఎన్ ఆర్ ఐ, ఇటు ఏపీ కార్య‌క‌ర్త‌లు అగ్గి మీద గుగ్గిళం అవుతున్నారు. ఇది కాస్తా పెరిగిందంటే మాత్రం ఎప్ప‌టి నుంచో పొత్తు కోసం ఎదురు చూస్తున్న టీడీపీకి జ‌న‌సేన అధినేత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.