Theatres in hyderabad empty due to coronavirusదేశంలోని రాష్ట్రాన్నీ కరోనా కలకలంతో బెంబేలెత్తిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 47 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేరళలో అత్యధికంగా తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. వారిలో ముగ్గురు ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సమస్య తీవ్రత ఎక్కువ అయ్యే సరికి కేరళ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు మూసి వెయ్యాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినారయి విజయన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. గుడులు, ఇతర ప్రార్థనాలయాలలో గుంపుగా చేసే ప్రార్థనలను కూడా ప్రభుత్వం ఆపేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి.

తెలంగాణాలో ఇప్పటికి ఒకే ఒక్క కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలను అవాయిడ్ చేయాలనీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుండడంతో సినిమాలకు సెలవిచ్చేశారు ప్రేక్షకులు.

దాంతో థియేటర్స్ అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. అయితే అధికారికంగా సినిమా థియేటర్లు మూసి వేసే ఆలోచన మాత్రం ఇప్పటివరకూ లేదని అంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరం అయితేనే కేరళ తరహా ఆంక్షలు విధిస్తాం అంటున్నారు అధికారులు.