The Jagan government doesn't care about Facilities in the High Courtరాజధాని ‘అమరావతి’ని ఆపేయడం తో సామాన్య ప్రజానీకానికే కాదు… ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు కూడా ఇబ్బంది తప్పడం లేదట. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టులో వసతులు చాలడంలేదని, మెరుగుపరచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదట. కార్యకలాపాల నిర్వహణకు ఇప్పుడున్న భవనం సరిపోవడం లేదని, అదనపు భవనం నిర్మించాలని ఇప్పటి వరకు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు లేఖలు రాశారట.

హైకోర్టులోని చాంబర్లు చాలా ఇరుకుగా ఉన్నాయని, కోర్టు గదులు సౌకర్యవంతంగా లేవని, పెరుగుతున్న కేసులకు, విచారణకు అనువైన సదుపాయాలు లేవని… పైగా లైబ్రరీలో పుస్తకాలు కిందే ఉంటున్నాయని గత చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరితోపాటు ప్రస్తుత సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామి కూడా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే మూడు రాజధానుల పేరిట ప్రస్తుతం అమరావతిలో ఒక్క ఇటుక వేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం లేదు. ‘న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలనుకుంటున్నాం కదా! అక్కడే అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం’ అని ఆ ప్రతిపాదనలను పక్కన పెడుతున్నట్టు సమాచారం. అయితే విశాఖ విషయం ఎలా ఉన్నా కర్నూల్ విషయం తేలడం అంత తేలిక కాదు.

అందుకు సుప్రీం కోర్టు, కేంద్ర న్యాయశాఖ అనుమతి తరువాత రాష్ట్రపతి ఉత్తరువు కావాలి. ఇదంతా అంత తేలికైన విషయం కాదు. దానితో న్యాయమూర్తులకు ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని నిరంతర సమస్యగా మారనుంది. ఇబ్బంది పడితేనే న్యాయమూర్తులు ఈ ప్రక్రియ ని వేగవంతం చేస్తారు అని ప్రభుత్వం అనుకుంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.