That credit goes to former minister Anil kumar yadavపోలవరం నిర్మాణం విషయంలో రాష్ట్ర మాజీ నీటిపారుదలశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రసంగం ఇప్పటికి నెట్టింట చక్కర్లు కొడుతోందంటే, ఏ రేంజ్ లో తన వాగ్ధాటిని ప్రదర్శించారో అర్ధం చేసుకోవచ్చు. అయితే జగన్ తాజా క్యాబినేట్ లో మంత్రి పదవి కోల్పోయిన అనిల్, ఇక తనని వదిలేయమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

‘మంత్రి పదవికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అంటూ మీడియాకు విన్నపాలు చేస్తున్నారంటే, ఏ రేంజ్ లో మీడియా వర్గాలు అనిల్ కుమార్ ను తూర్పారబట్టాయో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం పైన మూడేళ్లు మంత్రి పదవి అనుభవించి, ఇప్పుడు దాని గురించి ప్రశ్నలు వేయొద్దని అడగడం సబబేనా?

అంటే ఈ మూడేళ్లల్లో తాను చేసిందేమి లేదని పరోక్షంగా ఒప్పుకున్నట్లేగా? మూడేళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసి, ఇప్పుడు అంతా మర్చిపోండి, ‘నేను మంత్రిని కాదు’ అంటే, ప్రజలకు జవాబు చెప్పేదెవరు? ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో అధికారంలోకి వచ్చి రాగానే పోలవరం పనులు నిలిపివేసిన ఘనతను వైసీపీ ప్రభుత్వం సొంతం చేసుకుంది.

నాటి నుండి నేటి వరకు అయిన పనుల శాతం లెక్కిస్తే 1 నుండి 2 శాతంగా టీడీపీ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ, వాటిని కొట్టిపారేయలేదు, అలాగని అవి తప్పని నిరూపించలేదు. దీనికి తోడు ఎటకారపు మాటలతో విరుచుకుపడి, రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిన జాబితాలో అనిల్ కూడా ఓ కీలక భూమిక పోషించాడు. ఓ విధంగా మంత్రి పదవి నుండి తొలగించడం అనిల్ కు వరంలా మారినట్లుంది.

నిజంగా మంత్రి పదవిలో ఉన్నపుడు ఇంత ఉల్లాసంగా ఎప్పుడూ కనిపించలేదు కూడా! ఇక పోలవరంకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగరు, అడిగినా తాను ప్రస్తుతం మంత్రిగా లేను గనుక జవాబు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారేమో?! అయితే ఒక్క విషయంలో మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ను ప్రశంసించి తీరాల్సిందే.

‘నీటి’ పారుదలశాఖను కాస్త ‘నోటి’ పారుదలశాఖగా నామకరణం చేయడం వెనుక మాత్రం అనిల్ కృషి అమోఘం, మరొకరు దరిచేరలేనిది కూడా!