that credit goes to education minister botsa satyanarayanaఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిదంగా ఈసారి పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఏలూరు, కృష్ణా జిల్లాలలో విద్యార్దులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30మంది ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. మరో 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశామని ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు.

గతంలో కూడా అప్పుడప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యేవి కానీ ఈ స్థాయిలో కాలేదు. చాలా అరుదుగా మాస్ కాపీయింగ్ ఘటనలు జరిగాయి. ఈ కారణంగా ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం అసలే జరుగలేదు. కానీ ఈ అరుదైన పరిణామాలన్నీ ఈసారి విద్యాశాఖామాత్యులు మంత్రి బొత్స సత్యనారాయణగారి హయాంలోనే జరిగాయి.

ఇటువంటి ఘటనలు ఎక్కువగా బిహార్ రాష్ట్రంలో జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీని కూడా బీహార్ స్థాయికి చేర్చినందుకు ఈ క్రెడిట్ పూర్తిగా ఆయనకే సొంతం అని చెప్పక తప్పదు.

కృష్ణా జిల్లాలోని పసుమర్రు జెడ్‌పీ హైస్కూలులో పదో తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్ చేయిస్తున్నందుకు ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు దేవానంద్ రెడ్డి తెలిపారు.

అలాగే ఏలూరులో సత్రంపాడు విద్యా వికాస్ పాఠశాలలో పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ సమక్షంలోనే విద్యాశాఖకు చెందిన రామాంజనేయ వరప్రసాద్‌ అనే అధికారి స్వయంగా గణితం ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులు చెపుతుంటే, విద్యార్దులు కాపీ కొట్టకుండా గమనించాల్సిన ఇన్విజిలేటర్ ప్రదీప్ వాటిని కాగితాల మీద వ్రాసి విద్యార్దులకు అందజేసేందుకు సిద్దం చేస్తుండగా పోలీసులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు వారిని రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకొన్నారని దేవానంద్ రెడ్డి స్వయంగా తెలిపారు.

కనీసం పదో తరగతి పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులే మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తుండటం, ఈ కారణంగా అధికారులను, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయవలసి రావడం వారికీ, ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?విద్యార్దుల జీవితాలలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షలు ఈవిదంగా జరుగుతుంటే ఏపీ విద్యా ప్రమాణాలు ప్రశ్నార్ధకం కావా?దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?విద్యాశాఖ ఉన్నతాధికారులా లేక మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణా?