శుక్రవారం కాకినాడలో కాపు నేస్తం పధకం బటన్ నొక్కుడు కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చి తమను అన్నలా అదుకొంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ‘థాంక్యూ సిఎం సార్’ అని వ్రాసి ఉన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారి పొడుగునా విద్యార్థులు ఆ ప్లకార్డులు పట్టుకొని ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారని జగనన్న ఆత్మసాక్షి పత్రికలో చాటింపు వేసుకొంది.
దీనిపై వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, “వాట్ యాన్ ఐడియా సర్‌జీ! నేను ఈ ఫోటో చూసేవరకు మీ కాపు నేస్తం కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్లకార్డులు పట్టుకొని వచ్చారని అనుకొన్నాను. వారిని బస్సులలో తీసుకువస్తున్నప్పుడే ఆ ప్లకార్డులను మీ వాలంటీర్లతో వారికి ముందే అందజేసి ఉంటే బాగుండేది కదా?” అని ట్వీట్ చేస్తూ కాపు నేస్తం కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు ఖాళీ కుర్చీలలో ‘థాంక్యూ సిఎం సార్’ అని వ్రాసి ఉన్న ప్లకార్డులను సిద్దంగా పెట్టి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాధారణ కలిగిన నాయకుడని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ ఆయన కార్యక్రమానికి కూడా బస్సులలో జనసమీకరణ చేయవలసి రావడాన్ని ఏమనుకోవాలి? కాపు నేస్తం పధకం ద్వారా జగనన్న బటన్ నొక్కి మహిళల బ్యాంక్ ఖాతాలలో రూ.15,000 చొపున జమా చేస్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా రావాలి కానీ ఈ కార్యక్రమానికీ ఎందుకు జనసమీకరణ చేయవలసివచ్చింది?సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తే అక్కడి స్కూళ్ళన్నీ మూయించేసి విద్యార్థులను రోడ్లపై ఎండలో నిలబెట్టి వారి చేతుల్లో ‘థాంక్యూ సిఎం సార్’ అని ప్లకార్డులతో స్వాగతం పలికించాల్సిన అవసరం ఏమిటి?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కళ్ళకు కట్టినట్లు తెలియజేసేందుకు జనసేన పార్టీ ‘గుడ్ మార్నింగ్ సిఎం సర్’ పేరుతో ఓ వారం రోజులు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హోరెత్తించేసింది. దానికి కౌంటరుగానే వైసీపీ నేతలు ‘థాంక్యూ సిఎం సార్’ ఐడియాను అమలుచేసినట్లు అర్దమవుతోంది.
అయితే సంక్షేమ పధకాలు ఇస్తున్నందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటే అది ఆయనకీ గొప్పగా ఉంటుంది. కానీ జనసమీకరణ చేసి ఇలా బలవంతంగా వారిచేత ‘థాంక్యూ సిఎం సార్’ అనిపించుకోవడం సిగ్గు చేటు కాదా? వైసీపీ నేతలు ఆలోచిస్తే బాగుంటుంది.