Thammareddy Bharadwajaఅఆ సినిమాలో రావు రమేష్ తో త్రివిక్రమ్ చెప్పించే ఒక డైలాగు బాగా పాపులర్. శత్రువులు ఎక్కడో ఉండరు ఇదిగో ఇంట్లో కూతుళ్లు పెళ్ళాల రూపంలో మన చుట్టే ఉంటారని. ఇండస్ట్రీలోనూ అంతే. ఆస్కార్ వేడుక ఇంకో నాలుగు రోజుల్లో జరగనుంది. ఖచ్చితంగా అవార్డు వస్తుందనే నమ్మకంతో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్, చంద్రబోస్ అందరూ అక్కడే ఉన్నారు. విస్తృతంగా అమెరికా మీడియాలో ఇంటర్వ్యూలిస్తున్నారు. నాటు నాటుకి గ్యారెంటీగా పురస్కారం దక్కుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.

ఇలాంటి పాజిటివ్ వాతావరణంలో ఏ చిన్న నెగటివ్ కామెంట్ అయినా సరే ఇబ్బంది పెట్టేదే. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆస్కార్ ట్రిప్పు కోసం పెట్టిన ఫ్లైట్ టికెట్ల ఖర్చు ఎనభై కోట్ల దాకా ఉంటుందని ఈ డబ్బుతో ఓ ఎనిమిది సినిమాలు తీయొచ్చని వ్యాఖ్యానించడం నెటిజెన్లకు టార్గెట్ అవుతోంది. ఆయన ఉద్దేశం ఏమైనా ఇలా అనడం ముమ్మాటికీ కరెక్ట్ కాదు. యుఎస్ లో ఈవెంట్ జరిగినప్పుడు అక్కడి దాకా మనమే వెళ్ళాలి కానీ నిర్వాహకులు అదే పనిగా ఇండియా వచ్చి పురస్కారం ఇచ్చి వెళ్ళరుగా.

మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంతటి గుర్తింపు వస్తుందో లేదో తెలియదు. గ్యారెంటీ లేదు. అందుకే రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. జపాన్ తదితర దేశాల్లో ఆర్ఆర్ఆర్ ని గుడ్డిగా ఆదరించడం లేదే. మనకన్నా గొప్పగా అందులో ఎమోషన్ వాళ్లకు కనెక్ట్ అయ్యింది కాబట్టి నెంబర్ వన్ కలెక్షన్ల రికార్డును చేతిలో పెట్టారు. ఎన్కోర్ పేరుతో యుఎస్ లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తే ఒకే థియేటర్ లో 1600 టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. దీన్ని బట్టే ట్రిపులార్ గ్లోబల్ రీచ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఒకవేళ నిజంగా అకాడెమి అవార్డు వస్తే ఈ ఎనభై కోట్లనే మాట చాలా చిన్నది అవుతుంది. సరే ఆ డబ్బుతో ఎన్ని మీడియం బడ్జెట్ సినిమాలైనా తీయొచ్చు. కానీ అవి కనీసం జాతీయ అవార్డు అయినా తెస్తాయని గ్యారెంటీ ఉందా. పైన మాటన్న పెద్దాయనకు అనుకోకుండా ఓ అయిదు వందల కోట్లు కలిసొచ్చి రాజమౌళి డేట్లు ఇస్తానంటే ఓ పది కోట్లలో తీసిమ్మని అడుగుతారా. రాజీ పడమని డిమాండ్ చేస్తారా లేదే. ఎంత పిండికి ఎంత రొట్టె. ఇది వ్యాపారం. ఇలాగే చేయాలి. రూపాయి షాంపూకి టీవీలో కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రకటనలు ఇస్తారు. సింపుల్ లాజిక్. సినిమాలకూ అంతే.