pawan-kalyan-thammareddy-bharadwajపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ట్రేడ్ మార్కెట్ లో ఎంత సత్తా ఉందో, అభిమాన ప్రేక్షకుల్లోనూ అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఆ క్రేజ్, అభిమానాన్ని చూసే ఓ రాజకీయ పార్టీని స్థాపించేటంత ధైర్యం పవన్ చేసారని చెప్పడంలో సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం మూర్ఖత్వంతో కూడుకుని ఉందా? ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా గానీ, తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జనసేన’ అధినేత గురించి చెప్పిన తమ్మారెడ్డి… “పవన్ గనుక రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైపోతుంది… పవన్ పై ఉండే మూర్ఖపు అభిమానం, పవనిజం అంటూ వీళ్ళు పిలవడం…” ఇది రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక్కసారి బరిలోకి దిగిన పరిస్థితులు పవన్ కంట్రోల్ లో ఉండవు, ఆయన అనుకుంటారేమో నేను ఏం చెప్తే అది జరుగుతుందని… అలాగే అయితే మొన్న కాకినాడ సభలో ఒక వ్యక్తి చనిపోయి ఉండకూడదు కదా..! వ్రేలు కదిపితే మాట వినే రోజులు పోయాయి… అంటూ అభిమానుల తీరును కూడా ఏకరువు పెట్టారు.

18 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులన్న మాట నిజమేనని, ఓ 5 వేల మంది ప్రతి నియోజకవర్గం నుండి రోడ్డు మీదకు వస్తే ఆ ఊర్లు ఊర్లు అల్లకల్లోలం అయిపోవడానికి ఆ 5 వేల మంది చాలరా? ఒక్క నయీమ్ పేరు చెప్తేనే రాష్ట్రం అంతా గడగడలాడింది… ఇక మీరే అర్ధం చేసుకోవాలి అన్నట్లుగా ఓ నవ్వు నవ్వారు తమ్మారెడ్డి. అందులోనూ ఈ 5 వేల అభిమానులను “మిలిటెంట్ వర్కర్స్”తో పోల్చి సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు తమ్మారెడ్డి.

సినీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా, నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడతారన్న టాక్ ఉన్న తమ్మారెడ్డి ‘జనసేన’పై మరియు పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తమ్మారెడ్డిని విమర్శించే వారు విమర్శిస్తుంటే… సమర్ధించే వారు సమర్ధిస్తున్నారు. మరి మీరేమంటారు..?!