Thaanaa-Serndha-Koottam--Gang-Piracyరిలీజ్ కంటే ముందుగా సినిమా యూనిట్ కు సందేశం పంపి మరీ… పైరసీని రిలీజ్ చేయడంలో ప్రముఖ వెబ్ సైట్ ‘తమిళ్ రాకర్స్’ చేసే చాలెంజ్ లు నెటిజన్లకు తెలియనివి కావు. అయితే ఈ సారి అలాంటి చాలెంజ్ లు ఏవీ చేయలేదు గానీ, యధావిధిగా తమ వెబ్ సైట్ లో నేడు విడుదలైన తమిళ సినిమా “తానా సేరందా కూట్టం” పైరసీ కాపీని పోస్ట్ చేసింది. సూర్య నటించిన ఈ సినిమా తెలుగులో “గ్యాంగ్” పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.

అలా సదరు వెబ్ సైట్ లో పోస్ట్ చేసారో లేదో, మరో నిముషంలో ఆ చిత్ర దర్శకుడు విజ్ఞేశ్ శివన్ సదరు వెబ్ సైట్ కు విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేసారు. “తమిళ రాకర్స్ టీం సభ్యులారా… ప్లీజ్… మీకు ఒక హృదయం ఉంటే… దయచేసి దానిని వాడండి..! ఈ రోజు కోసం మేం చాలా శ్రమించాం… టాక్స్ నిబంధనలు, ఇండస్ట్రీ గోలలు… ఇవన్నీ అధిగమించి సినిమాలను రిలీజ్ చేసాం… దయచేసి మా సినిమాలకు ఈ పని చేయకండి…” అంటూ తన సినిమాతో పాటు విడుదలైన మరో రెండు సినిమాలు స్కెచ్ అండ్ గులేబగావలిలను కూడా ట్యాగ్ చేసారు.

నిజానికి సూర్య నటించిన ఒక్క సినిమానే కాదు, ఇటీవల పవన్ నటించిన “అజ్ఞాతవాసి” కూడా మొదటిరోజే సదరు వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. ఓ పక్కన సినిమాలకు వస్తున్న డివైడ్ టాక్, మరో పక్కన పైరసీ దెబ్బతో… కళకళలాడాల్సిన ధియేటర్లు వెలవెలబోతున్నాయి. పెందుర్తి వంటి ఊళ్ళల్లో అయితే ‘అజ్ఞాతవాసి’ షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటే… ఏ స్థాయిలో ప్రేక్షకుల రాక తగ్గిందో అంచనా వేయవచ్చు. సినిమా బాగోకపోవడం ఓ కారణం అయితే, బాగోని సినిమాకు అంత డబ్బులు వెచ్చించడం ఇష్టం లేని ప్రేక్షకులకు పైరసీ అనేది ప్రత్యామ్నాయంగా మారుతోందని చెప్పడంలో సందేహం లేదు.