TG - Venkateshఅంధ్రప్రదేశ్ రాజధానిపై తన వ్యాఖ్యలతో టీజీ వెంకటేశ్‌ సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చని, బీజేపీ అధిష్ఠానంతో జగన్‌ చర్చించారని, ఈ విషయం బీజేపీ అధిష్ఠానం తనతో చెప్పిందని వెల్లడించారు. ఏపీకి ఒకటి కాదు… నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప రాజధానులు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీ నుండి బీజేపీకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఉంటే ప్రజలకు పనులు చేయలేరని టీజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సేవ అనేది బీజేపీ బ్లడ్‌లోనే ఉందన్నారు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న టీజీ వెంకటేష్ కు బీజేపీ రక్తంలో ఏముందో ఇప్పుడే తెలిసినట్టుంది. టీడీపీ నుండి బీజేపీకి వచ్చాక పూర్తి రక్త మార్పిడి చేయించుకున్నారో లేదో.

రాజకీయాలలో పార్టీలు మారడం సహజమే కాకపోతే అలా అధికారం కోసం పార్టీ మారిన నాయకులు అదేదో తాము అదే పార్టీలో పుట్టి పెరిగాం అన్నట్టు మాట్లాడితేనే అబెట్టుగా ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ రద్దు చేసిన జగన్.. నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని, అందుకే నాలుగు రాజధానులు చేస్తారని అనుకుంటున్నానంటూ తన నాలుగు రాజధానుల ప్రకటనపై వివరణ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని.. కేంద్ర నాయకులతో చర్చించిన మాటలనే తాను చెప్పానన్నారు.