Tesla car Andhra Pradesh Roads‘టెస్లా’ కార్ల ఉత్పత్తికి సంబంధించి ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ కు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల మంత్రులు రిప్లై ఇస్తూ టెస్లాకు ఆహ్వానం పలికారు. ముందుగా పొరుగు రాష్ట్రమైన కేటీఆర్ స్పందించగా, అందరూ చేసారు గనుక ఏపీ నుండి ఎవరో ఒకరు చేయాలనే తలంపుతో కదిరి ఎమ్మెల్యే పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి కూడా మస్క్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.

“వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండస్ట్రీ పాలసీల విషయంలో చాలా అనువుగా ఉంటుందని, మా ఇండస్ట్రియల్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రీలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని, టెస్లాను ఆంధ్రప్రదేశ్ లోకి ఆహ్వానిస్తున్నామని” కదిరి ఎమ్మెల్యే ట్వీట్ చేసారు. పారిశ్రామిక శాఖా మంత్రి స్పందించినా లేకున్నా, ఎవరో ఒకరు రిప్లై ఇవ్వాలి కాబట్టి ఏపీ తరపున టెస్లాకు అప్లికేషన్ వెళ్ళినట్లయ్యింది.

అయితే కదిరి ఎమ్మెల్యే పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి చేసిన ట్వీట్ కు మస్క్ ఏమనుకున్నారో తెలియదు గానీ, నెటిజన్ల నుండి మాత్రం అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని రహదారుల స్థితిగతులు ప్రపంచమంతా తెలిసేలా, జగన్ పరిపాలన ఏపీలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అవగాహన వచ్చేలా చేస్తోన్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్స్ మొత్తం చదివితే చాలు… రెండేళ్లుగా జగన్ సర్కార్ ఎలా పని చేస్తుందో అర్ధం అయిపోతోంది.

రాజమండ్రి ప్రయాణిస్తున్న ఓ బస్సు వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఈ రోడ్లకు టెస్లా కావాలా?’ అంటూ ఓ నెటిజన్ చేసిన వీడియో అయితే తెగ వైరల్ అయ్యింది. గుంతల నడుమ రోడ్డు ఉన్నట్లుగా ఉన్న ఈ వీడియో ఏపీ సర్కార్ పరువు తీసేసినట్లయ్యింది. ఇలాంటి రోడ్లు మీద తిరిగితే కదా టెస్లా విలువ తెలిసేది.., టెస్ట్ డ్రైవింగ్ కోసమైనా టెస్లా కారును ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని.., ఇలా ఏపీ రోడ్ల పరిస్థితి గురించి నెటిజన్లు చేసిన ట్వీట్లు కోకొల్లలు.

కేవలం రహదారుల వివరణతో నెటిజన్లు ఆగలేదు. మటన్ షాపులు ఉండగా టెస్లా ఎందుకు దండగ… టెస్లా రాకపోతే ఏంటి మనకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ మాదిరే ‘టెస్లా బ్రాండ్’ను కూడా వదిలేయండి… టెస్లానే కాదు టీ కొట్టు వాడు కూడా రాడు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి… టెస్లా పక్కన పెట్టి, మీరు వచ్చాక ఏర్పాటు చేసిన ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి… ఇలా చెప్పుకుంటూ పోతే నెటిజన్ల క్రియేటివిటీకి ఎక్కడా కొదవుండదు.

స్టోరీ ఇక్కడితో ముగియలేదు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉండేలా ఇంకొన్ని ట్వీట్స్ ఉన్నాయి. సిద్ధారెడ్డి చేసిన ట్వీట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, అవేమి పట్టించుకోకుండా మస్క్ స్పందించి ఒకవేళ ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి, మీ రాజధానిలో పెడతాం, ‘ఏపీ రాజధాని ఎక్కడ?’ అంటే ఏం చెప్తారు? అన్న ప్రశ్నలు కూడా వైరల్ అవుతున్నాయి. టెస్లా సంగతేమో గానీ, మస్క్ కు ఏపీ ఎమ్మెల్యే ఇచ్చిన రిప్లైతో వైసీపీ సర్కార్ పరువంతా పోతోంది.