Buggana Rajendranathఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జీతాలు, డీఏ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులే చెపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కోర్టులో కేసులు వేస్తున్న కాంట్రాక్టర్లని అడిగితే చెపుతారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలోనే మకాం వేసే రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, ఆర్ధిక శాఖ అధికారులను చూస్తే అర్దమవుతుంది.

కనుక ఇటువంటి సమయంలో రాష్ట్ర విభజన వలన ఏపీకి కలిగిన రెవెన్యూలోటు భర్తీ కోసం కేంద్రం రూ.10,460 కోట్లు విడుదల చేయడం జగన్ ప్రభుత్వానికి చాలా ఊరట కలిగించే విషయమే అని చెప్పొచ్చు. ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు, నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఎంతగా బ్రతిమాలినా నిధులు విడుదల చేయని కేంద్రం, హటాత్తుగా ఇప్పుడు ఎందుకు విడుదల చేసిందనే సందేహం కలగడం సహజం. అప్పుడు దానిపై రాజకీయ విశ్లేషకులు మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం కూడా సహజమే.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇంత భారీగా నిధులు విడుదల చేయడంతో ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా అసూయతో రగిలిపోతూ నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నాయని ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది. ఇదంతా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఘనతే అని ఆయనను అభినందించాల్సిందే అని తీర్మానించింది కూడా. ఆయన ప్రయత్నాలు ఫలించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒకేసారి రూ.10,460 కోట్లు విడుదల చేసిందని, కానీ రాష్ట్రానికి నిధులు వచ్చినా ప్రతిపక్షాలు, వాటి మీడియా కుళ్ళుకొని ఏడుస్తుంటాయని ఎద్దేవా చేసింది.

ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేసిన వైసీపీ ప్రభుత్వానికి మరే పద్దులో అప్పులు పుట్టే అవకాశం లేకపోవడం వలననే, బుగ్గన బ్రతిమాలుకోగా కేంద్రం ఈ నిధులు విడుదల చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అయినా ఈ ఈ రూ.10,460 కోట్లు ఈ నెల ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పధకాలకే సరిపోతుంది. కనుక బుగ్గన మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ, నిర్మలా సీతారామన్‌లతో మాట్లాడి వచ్చే నెల మరో రూ.10,000 కోట్లు తేగలరా? అప్పుడు అందరం కలిసి అభినందిద్దాం?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒకేసారి రూ.10,460 కోట్లు విడుదల చేయడం వస్తున్న విమర్శలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏమన్నారంటే, “ఆంధ్రప్రదేశ్‌ మీద అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్రమోడీ నిధులు విడుదల చేశారు తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవు,” అని అన్నారు. అంటే అర్దం ఏమిటి?