telugu news channelsఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు లేదా వెరైటీగా చూపేందుకు సినిమాలలో కమెడీయన్లు, విలన్ల చేత తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించేవారు. దానిని ప్రేక్షకులు చాలా ఆస్వాదించారు కూడా. తెలంగాణ ఏర్పడిన తరువాత సిఎం కేసీఆర్‌ తమ తెలంగాణ భాష, యాస, పండుగలు, సంస్కృతీ ఔనత్యం పెంచడానికి అనేక చర్యలు చేపట్టారు. తత్ఫలితంగా ఇప్పుడు తెలంగాణ భాషకు, యాసకు ప్రత్యేక గౌరవం లభిస్తోంది. తెలంగాణ ప్రజలు కూడా తమ భాష, యాస పట్ల ఎంతో గర్వపడుతున్నారిప్పుడు.

దీంతో సినీ పరిశ్రమ కూడా తన తీరు మార్చుకొని తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను చాటి చెప్పేవిదంగా తెలంగాణ జిల్లాలో చక్కటి సినిమాలు తీసి అందరి మన్ననలు పొందుతోంది. పవన్ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో తెలంగాణ జానపద కిన్నెరసాని వాద్య కళాకారుడు దర్శన మొగులయ్యకు ఓ పాట పాడేందుకు అవకాశం కల్పించి గౌరవించారు. ఆ తరువాత ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా లభించిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రభుత్వానికి తమ బాష, యాస, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవం, వాటికి గౌరవం కల్పించాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో తెలుసుకొనేందుకు ఇవన్నీ చక్కటి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.

అయితే మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మన భాష, యాసలు, మాండలికాల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తెలుగు సినిమాలలో రాష్ట్రానికి సంబందం లేని భాష, యాస కనిపిస్తుంటాయి. కొందరు కొత్త దర్శకులు, రచయితలు, పవన్ కళ్యాణ్‌ వంటి తెలుగు భాషాభిమానులు అప్పుడప్పుడు మన తెలుగు భాష, యాసలు, మాండలికాలను చాలా చక్కగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. అందుకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిందే.

ఈ సందర్భంగా మన తెలుగు న్యూస్ ఛానల్స్‌ బాషా దాద్రిద్ర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వార్తలు మొదలు ప్రత్యేక చర్చా కార్యక్రమాలలో అందరూ కలిసి తెలుగు భాషను ఖూనీ చేసేస్తుంటారు. మనకు చిత్తూరు, కృష్ణా, గోదావరి, ఉత్తరాంద్ర జిల్లాలకు ప్రత్యేకమైన చక్కటి మాండలికాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, తీన్మార్ వార్తలు, ఇస్మార్ట్ న్యూస్ పేరుతో తెలంగాణ భాషలో వార్తలు ప్రసారం చేస్తుండటం భాషా దారిద్ర్యం కాకపోతే ఏమిటి?

ఒకప్పుడు తెలుగు సినిమాలు తెలంగాణ భాషను కామెడీ కోసం వాడుకొన్నాయని కానీ ఇప్పుడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలు ఆడని పరిస్థితి వచ్చిందని తెలంగాణ సిఎం కేసీఆర్‌ గర్వంగా చెప్పుకొన్నారు. కానీ మనం అలా చెప్పుకోలేకపోయినా కనీసం ఈ భాషా దారిద్యం నుంచి బయటపడి మన సినిమాలు, టీవీ ఛానల్స్‌లో మన భాషకు యాసకు, మాండలికాలకు సముచితం గౌరవం ఇచ్చుకోవాలి కదా?