Acharya Movie Ticketsసినిమాలలో పెద్ద సినిమాల లాభనష్టాలు, కష్టాలు వేరయా అన్నట్లుంది ప్రస్తుతం. పెద్ద హీరో హీరోయిన్లను పెట్టి వందల కోట్లు ఖర్చు చేసి పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూ యావత్ దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మన తెలుగు సినీ పరిశ్రమ, సొంత రాష్ట్రాలలోనే టికెట్ ఛార్జీల పెంపు, బెనిఫిట్ షోల కోసం ప్రభుత్వం దయాదాక్షిణ్యల కోసం ప్రాధేయపడవలసి రావడం, అయినా కూడా బోర్లా పడుతుండటం బాధాకరం.

దీనికి తాజా ఉదాహరణగా ఆచార్య కనిపిస్తోంది. అంటే టికెట్ ఛార్జీల పెంపు, బెనిఫిట్ షోలు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు కొంత వరకు సహాయపడగలవేమో కానీ సినిమా బాగోకపోతే కాపాడలేవని స్పష్టం అవుతోంది.

ఈ సమస్యపై ఓ మూవీ లవర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “సినిమాలకు టికెట్ ధరలు చాలా కీలకమైనవే కానీ సినిమా బాగోలేదని తెలిసినప్పుడు కూడా రూ.354 పెట్టి టికెట్స్ కొనుగోలు చేసి ఎంతమంది సినిమా చూస్తారు?ముఖ్యంగా కుటుంబంతో సహా వెళ్ళి సినిమాలు చూసేవారు ఆ ఆలోచన మానుకొంటారు.

కనుక సినిమా ఫలితం తెలిసిన తరువాత అవసరమైతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకొని టికెట్ ధరను రూ.150 లేదా 200కి తగ్గిస్తే, సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుండా చూసేవారు, కుటుంబ సమేతంగా సినిమాలు చూసేవారు, మరోసారి చూడాలనుకొనేవారు ఆసక్తి చూపిస్తారు.

సినిమా బాగోలేదని గుర్తించినప్పుడు టికెట్ ధరను తగ్గించుకొంటే సిద్దపడితే సినిమాకి వచ్చే ప్రేక్షకులు పెరుగుతారు కనుక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా లేదా తక్కువ నష్టంతో బయటపడగలుగుతారు,” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది చాలా మంచి ఆలోచనే. ఓ సినిమాలో హీరోకి “ఎక్కడ నెగ్గాలో కాదు…ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు” అనే డైలాగ్ ఈ సమస్యకు సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎక్కువ టికెట్ ధరతో తక్కువ మందిని ఆకర్షించడం కంటే, టికెట్ ధర తగ్గించుకొని ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగితే నిర్మాతలు నష్టపోకుండా బయటపడగలుగుతారు. లేకుంటే అదే సినిమా త్వరలో ఎలాగూ ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా? కేవలం రెండు సినిమా టికెట్ల ఖర్చుతో ఏడాది మొత్తం కుటుంబ సమేతంగా ఓటీటీలో అవే సినిమాలు చూడవచ్చు కదా?అనుకొనేవారు చాలా మందే ఉన్నారు. కనుక సినిమా ఫలితాన్ని బట్టి టికెట్ ధర తగ్గించుకోవడం మంచి ఆలోచనగా భావించవచ్చు.