సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసెంబ్లీలో బిల్ కూడా పాస్ కావడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలంతా ‘ఏం చేయాలో’ అని సమాలోచనలు చేస్తున్నారు.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్ గా తీసుకువచ్చిన ఈ బిల్లు ప్రభావం ఏమిటో ఇండస్ట్రీ వర్గాలకు బాగా తెలుసు. అసెంబ్లీ ఆవరణ పేర్ని నాని చెప్పిన విధానంతో, ఈ బిల్లును మళ్ళీ జగన్ సర్కార్ ఇప్పట్లో వెనక్కి తీసుకుంటుందన్న నమ్మకం సినీ వర్గాల్లో ఏర్పడడం లేదు.

తొలుత ఏపీ సర్కార్ తో చర్చలను చేసే ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అవి కార్యరూపం దాల్చకపోతే, అంతిమంగా “బ్రహ్మాస్త్రాన్ని” ప్రయోగించే ఉద్దేశంలో కూడా ఉన్నట్లు ట్రేడ్ టాక్. ఎందుకంటే గత రెండేళ్లుగా అధికార పక్షాన్ని నిలువరిస్తున్నది ఆ ‘ఒక్కటి’ మాత్రమే!

ఇటీవల ఏ వార్తలను అయితే ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ ఖండించిందో… అంతిమంగా ఆ రూట్ లో పయనించడమే ఇండస్ట్రీకి ఉన్న ఏకైక మార్గంగా సినీ పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సినీ పరిభాషలో ‘బ్రహ్మాస్త్రం’గా ఆంధ్రప్రదేశ్ ‘హైకోర్టు’ కొనియాడబడుతోంది.

వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, తీరా రిలీజ్ సమయం దగ్గరికి వచ్చేపాటికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే, న్యాయం జరగాలంటే హైకోర్ట్ మెట్లు ఎక్కడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నది సినీ పరిశీలకుల మాట. ‘పోరాడితే పోయేదేముంది… బానిస సంకెళ్లు తప్ప..!’ అన్న పవన్ మాటలే ఇండస్ట్రీకి ఉన్న మార్గం… అది కోర్టులో అయినా… ప్రత్యక్షంగా అయినా..!