Media on tirupati bypoll riggingతిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగానే వచ్చాయి. భారీ ఆధిక్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మొదటి స్థానంలో ఉన్నారు. టీడీపీ రెండో స్థానంలో సరిపెట్టుకోగా… టీడీపీకే చాలా దూరంగా బీజేపీది డిపాజిట్ కోల్పోయే స్థితి. పోలింగ్ రోజు జరిగిన దొంగ ఓట్ల పర్వంతో ఫలితం ఇందుకు భిన్నంగా వస్తుందని తామేమీ అనుకోలేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.

ప్రముఖ ఛానల్ లో ఒక సీనియర్ జర్నలిస్టు దీని మీద ఒక చర్చా కార్యక్రమం నడిపారు. ఇందులో భాగంగా ఒక జనసేన నాయకుడు పోలింగ్ రోజు జరిగిన దొంగ ఓట్ల పర్వం కారణంగానే ఇటువంటి ఫలితాలు వచ్చాయని ఏదో చెప్పబోయారు. అయితే ఆ సీనియర్ జర్నలిస్టు మధ్యలో అందుకుని చెప్పిన ఒక మాట ప్రజాస్వామ్యాన్నే అవమానించేదిగా ఉంది.

“తిరుపతి లో దొంగ ఓట్లు పడ్డాయ్ కానీ 50,000 కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు కదా? అప్పుడు ఇంత మెజారిటీ ని ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా సమర్ధించుకోగలవు,” అని అన్నాడు ఆయన. ఇందులో ఏ పార్టీ కరెక్ట్ ఏ పార్టీ తప్పు అనేది పక్కన పెడితే… దొంగ ఓట్లు పడ్డాయ్… కానీ అన్ని పడలేదు… ఇన్నే పడ్డాయి అని చెప్పుకునే స్థాయికి మన విలువలు పడిపోయాయా?

పైగా ఆ చెప్పింది ఎవరో రాజకీయ నాయకుడు అంటే సరే అనుకోవచ్చు. మీడియా కూడా నా? పైగా ఎన్నో ఏళ్లగా జర్నలిజం వెలగబెడుతున్న వారా? మరీ ఇంతగా మీడియా అధికార పార్టీలకు కొమ్ము కాసి కనీస విలువలు పాటించకపోతే ఈ ఎన్నికలు, రాజ్యాంగం, ఇవన్నీ ఎందుకు? విలువలు లేకపోయినా సరే కనీసం ఉన్నట్టుగా కూడా నటించరా?