telugu desam support for pawan kalyan sardaar gabbar singhనందమూరి కుటుంబాల హీరోలు నటించిన సినిమాలకు తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటూ ఉండేవి. అయితే ఇటీవల కాలంలో బాలకృష్ణ, నారా రోహిత్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. అయితే 2014 ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సహాయం రీత్యా… టిడిపికి అత్యంత సన్నిహితుడుగా పిలవబడుతున్న పవన్ కళ్యాణ్ నటించిన “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

బహుశా ఎన్నికల సమయంలో చేసిన సాయానికి కృతజ్ఞత తీర్చుకునే అవకాశం దక్కిందని భావించారో ఏమో గానీ, ఏప్రిల్ 8వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న “సర్ధార్” మోత 7వ తేదీ అర్దరాత్రి నుండే ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో దీనికి కావలసిన అన్నీ అనుమతులను పోలీస్ అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్లియర్ చేస్తోందని సమాచారం. నిజానికి గత కొన్నాళ్లుగా అర్ధరాత్రి షోలను ఏపీలో బ్యాన్ చేసారు. కేవలం ఒకటి, రెండు ప్రదేశాలలో మాత్రమే వేకువజామున ఆటలకు అనుమతి ఇస్తున్నారు.

కానీ, “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు ఇస్తున్న అనుమతులు చూస్తుంటే… దాదాపుగా ఏపీలో అన్ని ప్రాంతాలలో మిడ్ నైట్ షోలు ప్రదర్శితం కాబోతున్నాయని తెలుస్తోంది. అలాగే వీటికి తోడు వేకువజామున షోలు, బెనిఫిట్ షోలు వేస్తుండడంతో 8వ తేదీ సినిమా రిలీజ్ అయ్యే నాటికే బాక్సాఫీస్ వద్ద ‘సర్ధార్’ సత్తా తెలిసిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. షోలకు సంబంధించిన అనుమతుల విషయంలోనే కాకుండా, చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం రాజకీయ నాయకులు మొదటి రోజు ఆటలకు చాలా ధియేటర్లను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఏపీలోని 90 శాతం పైగా ధియేటర్లలో 8వ తేదీ “సర్ధార్ గబ్బర్ సింగ్” ప్రత్యక్షం కానున్నాడు. ఈ ఊపు చూస్తుంటే… ఖచ్చితంగా ‘బాహుబలి’ మొదటి రోజు రికార్డులకు ఎసరు పెట్టేలా కనపడుతున్నాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో తెలుగుదేశం అండదండలు ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇటీవల కాలంలో ‘బుడ్డోడు’ సినిమాల పరిస్థితి తెలియనిది కాదు. మరి పవన్ ప్రభంజనానికి తోడు టిడిపి కూడా మరో చేయి వేస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే “సర్ధార్”కు కావాల్సిందల్లా ఒక్క ‘పాజిటివ్’ టాక్ మాత్రమే..!