TDP-Leader-murderరాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏవిదంగా, ఎంత వేగంగా అభివృద్ధి చేసుకోవాలని పాలకులు ఆలోచించాల్సి ఉండగా రాజకీయ కక్ష సాధింపులతోనే మూడేళ్ళ పుణ్యకాలం పూర్తయింది. రాజకీయ పార్టీలు పరస్పరం విభేదించుకోవడం సహజమే కానీ వెంటపడి వేటాడి హత్యలు చేసేంతగా కక్ష సాధింపులకు పూనుకొంటే రాష్ట్రం ఏమవుతుంది?

ఒకప్పుడు రాయలసీమ, పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ ప్రాంతాలలో కూడా క్రమంగా పరిస్థితులలో మార్పు రావడంతో అందరూ సంతోషించారు. కానీ గత కొంత కాలంగా ఆ ప్రాంతాలలో జరుగుతున్న దాడులు, హత్యలు చూస్తుంటే పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.

పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో శుక్రవారం కంచర్ల జల్లయ్య (38) అనే ఓ టిడిపి కార్యకర్తని వారి ప్రత్యర్ధి వర్గం బందించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి అతికిరాతకంగా కత్తులు గొడ్డళ్ళతో నరికి చంపేశారు.

జల్లయ్యతో పాటు వచ్చిన బంధువులు ఆవుల ఎల్లయ్య, కంచర్ల బక్కయ్యలు వారి నుంచి తప్పించుకొని పారిపోతుంటే ప్రత్యర్ధులు వారిని కూడా వేటాడి చంపేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు వారు తీవ్ర గాయాలైనప్పటికీ తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొన్నారు.

ఇంతకీ జలయ్య చేసిన నేరం ఏమిటంటే అతను టిడిపి కార్యకర్త కావడమే. కంచర్ల జలయ్య 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ వేధింపులు భరించలేక ప్రాణభయంతో గురజాల మండలం మాడుగులకు వలసపోయి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.

సుమారు మూడేళ్ళ తరువాత స్వగ్రామంలో బంధుమిత్రులకి కొడుకు పెళ్ళి శుభలేఖలు పంచేందుకు జలయ్య, ఎల్లయ్య, బక్కయ్యలతో కలిసి రెండు బైక్స్‌పై శుక్రవారం జంగమహేశ్వరపాడుకి బయలుదేరారు. అతను వస్తున్నట్లు తెలుసుకొన్న ప్రత్యర్ధి వర్గం దారిలో మించాలపాడు అడ్డురోడ్డు వద్ద కాపుకాసి వారిని అడ్డుకొన్నారు. వారి నుంచి ఎల్లయ్య, బక్కయ్యలు తప్పించుకోగలిగారు కానీ జల్లయ్య దొరికిపోయి వారి చేతిలో బలైపోయాడు.

తమపై గ్రామంలో కొందరు ప్రత్యర్ధులు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని, బ్యాంకు నుంచి తీసుకొన్న రూ.5 లక్షలు కూడా దోచుకొన్నారని ఎల్లయ్య, బక్కయ్య చెప్పారు. ప్రస్తుతం వారిద్దరూ మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జలయ్య హత్యతో జంగమహేశ్వరపాడులో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గురజాల ఎస్పీ జయరాం ప్రసాద్ గ్రామంలో పర్యటించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయించారు. జలయ్య మృతదేహానికి నరసారావుపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

మాచర్ల, నరసారావుపేట టిడిపి ఇన్‌ఛార్జులు బ్రహ్మారెడ్డి, డాక్టర్ అరవింద్ బాబు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్న మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్సార్ పార్టీ జిల్లాలో టిడిపి శ్రేణులను భయపెట్టేందుకు ఈవిదంగా హత్యలు, దాడులకు తెగబడుతోంది. టిడిపి కార్యకర్తలైతే హత్య చేసేస్తారా?ఓ పక్క తమ పార్టీ బడుగు బలహీనవర్గాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకొంటూ, మరో పక్క ఈవిదంగా బడుగు బలహీనవర్గాలపై దాడులు, హత్యలు చేస్తోంది. ఈ దాడులు, హత్యపై మేము మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాము,” అని చెప్పారు.