Telugu Desam Party has to give Power to minorities“బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం” తరచూ వినిపించే నినాదం. పేదలు, బలహీన, దళిత వర్గాలు రాజ్యాధికారంలోనికి రావాలనే ఆయా వర్గాల ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం ఇది. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలగా నినాదంగానే మిగిలిపోయింది. రాజకీయాలు కేవలం అగ్రవర్ణ మెూతుబరులకే అనే భావన తెలుగుదేశం ఆవిర్భావంతో చాలా వరకు తొలగినా, ఇంకా అత్యున్నత పీఠాని చేరుకునే నిచ్చెన కోసం ఆయా వర్గాలు వెతుకుతూనే ఉన్నాయి. తెలుగుదేశానికి పూర్వం అప్రతిహతంగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ నుండి కేవలం దామెూదరం సంజీవయ్య గారు మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారు కానీ, కాంగ్రేసును సొంత ఆస్తిలా భావించే వర్గాలు ఆయనను రెండేళ్ళలోనే పదవి నుంచి దించేసాయి. అప్పటికి దేశం మెుత్తం విస్తరించిన జాతీయ కాంగ్రేసు పార్టీ అద్యక్షుడిగా పని చేయగలిగిన సంజీవయ్య ఇక్కడి వర్గ ఆధిపత్య రాజకీయాలకు మాత్రం తలవంచక తప్పలేదు.

యన్టీఆర్ తెలుగుదేశం స్ధాపించినపుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చదువుకున్న బిసి, దళిత యవకులకు వేదిక కల్పించారు. అప్పటి యువకులలో చాలా మంది నలభై సంవత్సరాల తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారంటే అప్పుడు తెలుగుదేశం వేసిన పునాది ఎంత బలమైనదో అర్దంచేసుకోవచ్చు. ఇవికాక అప్పటి సమాజంలో పీడక, దోపిడీ వ్యవస్థలుగా పేరు పడిన పటేల్, పట్వారీ, కరణం వంటి వాటిని రద్దు చేస్తూ, మరింత పారదర్శకమైన మండల వ్యవస్థలను ప్రవేశ పెట్టి పల్లెలను ఆధిపత్య వర్గాల గుప్పెట నుండి విడిపించి, బలహీన వర్గాలకు చేరువ చేసారు. స్ధానిక సంస్థల్లో 35% బిసిలకు రిజర్వేషన్లు పెట్టి బిసిలలో పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేసారు. ఆయన ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల పధకం ద్వారా పేదలు ఆకలిని అధిగమిస్తే, గురుకుల పాఠశాల ద్వారా నాణ్యమైన చదువులు అందుకోగలిగారు. ఈనాడు బడుగు, బలహీన వర్గాలు విధ్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఎదిగడానికి తెలుగుదేశం తెచ్చిన మార్పు ఒక వేయి రీసెర్చి సబ్జెక్టులకు సరిపోయే అంశం.

ఇంత ప్రగతి సాదించినా ఇప్పటికీ ముఖ్యపీఠం మాత్రం ఆ వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముందుగా ఆంధ్ర రాజకీయాలు చూస్తే అక్కడ కేవలం రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే చట్టసభలో ఉన్నాయి. కొద్దిపాటి గుర్తింపు ఉన్న మూడో పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అవ్వడం, జాతీయ పార్టీలకు కనీసం రెండు మూడు శాతం ఓటింగ్ లేకపోవడం, ఆ పార్టీల అద్యక్షులెవరో కూడా జాతీయ నాయకత్వాలకు తెలియకపోవడం గమనిస్తే ఇక్కడ మరో నాలుగు పర్యాయాలకైనా అవి పుంజుకోవడం తేలికకాదు. ఎన్నిచెప్పినా బలమైన ప్రాంతీయ పార్టీల రాజకీయం వ్యక్తుల చుట్టూ, కుటుంబాల చుట్టూ తిరగడం దశాబ్దాలగా నడుస్తున్న చరిత్ర, దీనిని పరిగణనలోకి తీసుకుంటే బలహీన వర్గాలు ఆంధ్రలో కనీసం మరో రెండు పర్యాయాలైనా నిరీక్షించాలేమెూ.

మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో రాష్ట్రం రాకముందు తెరాస నాయకత్వం దళితులకు ముఖ్యమంత్రి పదవి ఆశ చూపినా, రాష్ట్రం సిద్దించి అధికారం అందాక అదొక రాజకీయ ప్రహసనంలా మిగిలింది. అదే సమయంలో తెలుగుదేశం బిసి ముఖ్యమంత్రి నినాదంతో ప్రముఖ బిసి నాయకుడు కృష్ణయ్య గారిని ఎన్నికల ముందే ముఖ్యమంత్రిగా ప్రకటించినా, అధికార పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. కానీ తెలుగుదేశం తన పంథాని మార్చుకోలేదు, రెడ్డి, వెలమ, కమ్మ వర్గాలకు చెందిన బలమైన నాయకులున్నా పార్టీ రాష్ట్ర అద్యక్షులుగా బిసి వర్గానికి చెందిన యల్ రమణ గారిని నియమించింది. అలాగే అధికారం ఉన్న ఆంధ్రలో కూడా బిసి వర్గానికే చెందిన కిమిడి గారిని నియమించింది. ఆ తరువాతి పరిణామాలతో తెలంగాణలో పార్టీ నాయకులు దాదాపుగా జారిపోయినా, వరుస ఓటములు ఎదురైనా, రమణ పార్టీ మారే వరకూ ఆయనే రాష్ట్ర అద్యక్షులుగా ఉన్నారు. ఆయన పార్టీ వీడిన తరువాత కూడా దళిత వర్గానికి చెందిన బక్కని నరసింహులు గారికి అద్యక్ష భాద్యతలు అప్పగించారు. అలాగే ఆంధ్రలో కళావెంకటరావు గారి తరువాత మరో బలమైన బిసి నాయకులు కింజరపు అచ్చెన్నాయుడి గారిని అద్యక్షులుగా నియమించారు. ఇవి తెలుగు రాష్ట్రాలలో సాటి ప్రాంతీయ పార్టీల్లో కనీసం ఊహకు కూడా అందని విషయం.

ఇటీవల తెలంగాణలో మరో ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ పాత కాపైన, ఇటీవలే తిరిగి పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అద్యక్షుడిగా నియమించి, బక్కని నర్సింహులును పార్టీ జాతీయ కార్యదర్శి గా నియమించింది. ఇలా ఎన్ని నష్టాలు వచ్చినా బడుగులకు అధికారం అనే విషయంలో తన మాటకు కట్టుబడే ఉంది. తెలుగుదేశం అధినాయకత్వం అంతా ఆంధ్రలో చట్టసభ సభ్యులుగా ఉన్నందున ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అధికారం వైపు రాకపోవచ్చు. అదీకాక చంద్రబాబు గత ఏడేళ్ళుగా ఇక్కడి నాయకత్వానికి ‘మీరే ఇక్కడి నాయకులు, మీరు పోరాడండి నేను అండగా ఉంటాను’ అనే చెబుతూ వస్తున్నారు. తెలుగు దేశానికి ఇప్పటికీ తెలంగాణలో చెప్పుకోదగిన కార్యకర్తలు, సానుభూతి పరులు ఉన్నారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు, రెండు వైయస్ పార్టీల మెుత్తం ఓటింగ్ కంటే తెలుగుదేశం ఓటింగ్ పర్సంటేజీ చాలా ఎక్కువ. నాయకులు బలంగా నిలబడితే చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు గెలుచుకోగల సామర్థ్యం కూడా ఉంది. ఇన్ని సానుకూలతలు కల పార్టీని ఉపయెూగించుకొని బడుగు, బలహీన వర్గాల నాయకులు తమ సుదీర్ఘ కలను నెరవేర్చుకోగలరా? నాలుగు దశాబ్దాల నుంచి ప్రజలకు తెలిసిన పార్టీ, పార్టీ గుర్తు, దశాబ్దంనర్ర పైగా తెలంగాణలో అధికారంలో ఉండి అనేక సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టులు తేవడం, ముఖ్యంగా బిసిల పార్టీ అన్న పేరు, బిసిలకు ముఖ్యమంత్రి అన్న మాటకు కట్టుబడి ఉండటం, పార్టీ అద్యక్షుడిగా బలమైన బిసి నాయకుడు, ఇలా అన్నీ అమర్చిన నిచ్చెన తెలుగుదేశం పార్టీ రూపంలో సిద్దంగా ఉంది, మరి ఈ నిచ్చెన వాడుకుని బడుగులకు రాజ్యాధికారం అనే నాయకులు, వర్గాలు అధికార పీఠం చేరుకోగలవో లేదో కాలమే చెప్పాలి!

శ్రీకాంత్.సి