Telangana Woman Forest Officer, Team Attacked  by TRS Workersగతంలో ఆంధ్రప్రదేశ్ లో వనజాక్షి ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ ఘటన చంద్రబాబు రూలింగ్ కు ఒక మచ్చగా మారింది. ఇప్పుడు సరిగ్గా అటువంటి ఘటనే తెలంగాణాలో జరిగింది. కుమురుం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్‌సాలా గ్రామం రణరంగంగా మారింది. అటవీశాఖ సిబ్బందిపై అధికార ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ అనుచరులు కర్రలతో దాడికి దిగడంతో ఎఫ్ఆర్వో చోలే అనితకు తీవ్ర గాయాలయ్యాయి.

కృష్ణ జెడ్పీ వైస్ ఛైర్మన్ గా ఉండటం గమనార్హం. ఆయన అధికారులతో వాగ్వివాదానికి దిగడం గమనార్హం. హరితహారంలో భాగంగా సార్‌సాలాగ్రామ సమీపంలో ఉన్న అటవీ భూమిని చదును చేసేందుకు ఆదివారం ఉదయం ఎఫ్‌ఆర్వో చోలే అనిత నేతృత్వంలో అటవీసిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్లతో సహా గ్రామానికి చేరుకున్న అటవీ సిబ్బందిని ఆయన అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో వారు వాగ్వాదానికి దిగారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అటవీభూములను స్వాధీనం చేసుకుంటామని ఎఫ్ఆర్వో అనిత స్పష్టం చేయడంతో ఆగ్రహించిన వారు ఒక్కసారిగా ఆమెపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఎఫ్ఆర్వో అనితను కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సదరు భూమిని కబ్జా చెయ్యడనికే ఈ దుస్సాహసానికి పాల్పడ్డారని అధికారులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ అధికారి ఎమ్మెల్యే ఆయన సోదరుడికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు.