Somu Veerrajuతెలంగాణలో బీజేపీ అదరగొట్టింది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో సంచలన ఫలితాలు నమోదు చేసి బీజేపీ సంచలనం సృష్టించింది. అక్కడి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అయితే దానితో ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ ఇప్పుడు ఒత్తిడి ఉంది. మైకు దొరికితే ప్రగల్బాలు పలికే ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇది పరీక్షగా మారింది.

తిరుపతి ఉపఎన్నిక కూడా దగ్గరలో ఉండటంతో బీజేపీకి అది అగ్నిపరీక్ష కానుంది. తిరుపతిలో గెలవడం లేదా.. మెరుగ్గా రాణించడం అంత తేలికైన విషయం కాదు. ఎస్సి రిజర్వుడు నియోజకవర్గంలో బీజేపీకి అభ్యర్థి దొరకడం కూడా కష్టమే. పైగా తిరుపతి అప్పట్లో కాంగ్రెస్ కు ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కు కంచుకోట.

2019లో తిరుప‌తి ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అటు బీజేపీ గానీ ఇటు జనసేన గానీ పెద్దగా ఓట్లు సాధించింది లేదు. ఒక్క తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోనే జ‌న‌సేన పార్టీ 12 వేల స్థాయిలో ఓట్ల‌ను పొందింది. తిరుపతి ఎంపీ సీటుని అయితే ఫలితాన్ని ముందే ఊహించి అప్పట్లో దానిని బీఎస్పీకి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలో అక్కడ పోటీ చేసి గెలవడం అసంభవం. కావున కనీసం రెండో స్థానం నైనా నిలవాలని బీజేపీ జనసేనలు ఆరాటపడుతున్నాయి. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ని భయపెట్టలేకపోయినా కనీసం టీడీపీ స్థానాన్ని ఆక్రమించాం అనే మెస్సేజ్ పంపొచ్చు అనేది ఆలోచన.