Talasani-Srinivas-Yadav TRS Party Ministerనిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణ మంత్రుల మద్య మొదలైన పరస్పర విమర్శలు కాకతాళీయమా లేక టిఆర్ఎస్‌, వైసీపీల వ్యూహంలో భాగమా అనేది తరువాత తెలుస్తుంది. అయితే దీనిపై ఏపీ మంత్రులు ఏదో ఎదురుదాడి చేయాలి కనుక చేస్తున్నట్లుంటే, తెలంగాణ మంత్రులు చక్కటి రాజకీయ పరిణతితో స్పందిస్తున్నారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “నిన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మా రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి మాత్రమే ఏపీతో పోల్చారు తప్ప ఏపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అవమానించాలని కాదు. సాధారణంగా ఎవరైనా ఓ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేనితోనో పోల్చి చెపుతుంటారు. ఉదాహరణకి మన దేశం అభివృద్ధి గురించి మాట్లాడుకొంటునప్పుడు, ఏ అమెరికాతోనో పోల్చుకొంటాము. అలాగే కేటీఆర్‌ కూడా చెప్పారు.

అయితే కొందరు ఏపీ మంత్రులు ఏదో మాట్లాడాలి గాబట్టి ఏదేదో అనేస్తున్నారు. ఇది మంచిది కాదు. మా రాజధాని హైదరాబాద్‌ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందింది కనుకనే పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయి తప్ప ఏదో ఆషామాషీగా రావడం లేదు కదా? ఒకవేళ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నట్లు మా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉంటే పరిశ్రమలు తరలివచ్చేవా?ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇక్కడ హైదరాబాద్‌లో నివాసం ఉండేవారా? వారి పిల్లల పెళ్ళిలు, ఫంక్షన్లు చేసుకొనేవారా?చివరికి కరోనా సమయంలో వైద్యం కోసం వారు ఏపీ నుంచి ఇక్కడకి వచ్చిన మాట వాస్తవం కాదా?ఇవన్నీ కళ్ళకు కనబడుతున్న వాస్తవాలే కదా?

తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధి కావాలనే కోరుకొంటున్నాము కూడా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ అన్ని విదాలా అభివృద్ధి చెందితే మేము సంతోషిస్తామే తప్ప ఈర్ష్య పడము. కనుక మా కేటీఆర్‌ గారు ఏదో యధాలాపంగా అన్న మాటలు పట్టుకొని ఏపీ మంత్రులు ఆవేశంతో తొందరపడి నోరు జారడం సరికాదు,” అని అన్నారు.

ఏపీ పర్యాటక మంత్రి ఆర్‌కె. రోజా శుక్రవారం హైదరాబాద్‌లో సిఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చిన తరువాత ఆమె మాట్లాడిన మాటలకు, ఇవాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన ఈ మాటలకు ఎంత వ్యత్యాసం ఉందో గమనిస్తే ఏపీ, తెలంగాణ మంత్రుల రాజకీయ పరిణితిలో ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు.