telangana trs bjp survey తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆరా సర్వే) ప్రకటించిన నివేదికపై టిఆర్ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఆరా ఏమి చెప్పిందంటే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టిఆర్ఎస్‌కు 38.88 శాతం, బిజెపికి 30.48 శాతం, కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం, మిగిలిన అన్నీ పార్టీలకు కలిపి 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

టిఆర్ఎస్‌కు 2018 ఎన్నికలలో 46.87 శాతం ఓట్లురాగా ఆరా సర్వే ప్రకారం ఇప్పుడు 8 శాతం తగ్గి 38.88 శాతం మాత్రమే వస్తాయని చెప్పడం ఒక కారణం కాగా, 2018 ఎన్నికలలో 6.98 శాతం వచ్చిన బిజెపికి ఇప్పుడు ఏకంగా 23.5 శాతం పెరిగి 30.48 శాతం ఓట్లు వస్తాయని చెప్పడమే టిఆర్ఎస్‌ ఆగ్రహానికి మరో కారణంగా కనిపిస్తోంది.

తెలంగాణలో స్థిరపడిన ఆంద్రా ప్రజలు టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలవైపు చూస్తుండగా, ఉత్తరాది ప్రజలు బిజెపివైపు మొగ్గు చూపుతున్నారని ఆరా చెప్పడంతో టిఆర్ఎస్‌ భగ్గుమంది.

ఇటీవల సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి సిద్దం అని ప్రకటించిన వెంటనే ఆరా ఇటువంటి నివేదిక ప్రకటించడం విశేషం. అది రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని టిఆర్ఎస్‌ ఆందోళన చెందుతోంది. అందుకే ఆరా సంస్థపై ఎదురుదాడి చేసింది. ఆరా సంస్థ బిజెపి నేతలతో అంటకాగుతోందని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా దురుదేశ్యపూర్వకంగా ఇటువంటి తప్పుడు నివేదికలు ప్రకటించి తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని టిఆర్ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు 100కి పైగా సీట్లు వస్తాయని సిఎం కేసీఆర్‌ పదేపదే చెపుతున్నారు. రాష్ట్రంలో బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంపై కత్తులు దూస్తూ ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బిజెపి దూకుడు ఇంకా పెరిగిపోయింది. ఎంతగా అంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలద్రోయగలమని బెదిరించే స్థాయికి చేరుకొంది. కనుక టిఆర్ఎస్‌ ఆందోళన చెందడం సహజమే.