TDP- Telanganaమహాకూటమిలోని పొత్తులలో భాగంగా తెలుగు దేశం పార్టీకి 14 సీట్లు కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఒకప్పుడు తెలంగాణాలో ఒక వెలుగు వెలిగిన పార్టీ 14 సీట్లకు పడిపోయిందని ఆ పార్టీ అభిమానులు బాధపడ్డారు. అయితే కనీసం ఆ 14 సీట్లలో కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది సైకిల్ పార్టీ. ఇప్పుడు మొత్తానికి ఆ పార్టీ పోటీ పడుతున్న స్థానాలు కేవలం 12. 13 సీట్లకు అభ్యర్థులకు బీ-ఫారం ఇచ్చిన టీడీపీ అనూహ్యంగా పఠాన్ చెరు స్థానానికి అభ్యర్థిని పెట్టలేదు.

ఆ సీటు కోసమే బీజేపీ నుండి టీడీపీలో చేరిన నందీశ్వర్ గౌడ్ ఉన్నా కాంగ్రెస్ కే ఆ సీటును వదిలేసింది. అయితే మిగిలిన 13 స్థానాలలో ఒక స్థానం నుండి ఆ పార్టీ ఇప్పుడు తప్పుకుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే, టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి అక్కడి నుంచి పోటీ చేయడం ఆది నుంచీ ఇష్టం లేదు. ఆయన తనకు పట్టున్న ఎల్‌బీనగర్‌ టికెట్‌ ఆశించారు. ఎల్‌బీనగర్‌ను కూటమి పొత్తుల్లో కాంగ్రెస్‌ నేత సుధీర్‌రెడ్డికి కేటాయించారు.

అయిష్టంగానే ఇబ్రహీంపట్నంలో నామినేషన్‌ వేసిన సామ రంగారెడ్డి పోటీకి ససేమిరా అనడంతో టీడీపీ ఇబ్రహీంపట్నం నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రె్‌సకు అనధికారికంగా చెప్పింది. చేసేది ఏమీ లేక బీఎస్పీ తరఫున నామినేషన్‌ వేసిన మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కేవలం 12 స్థానాలలో నిలిచింది. 2014 ఎన్నికలలో 15 సీట్లు గెలిచిన టీడీపీ ఈ ఎన్నికలలో కనీసం 15 సీట్లలో కూడా పోటీ చేయలేకపోవడం ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు మింగుడుపడడం లేదు.

బలమైన అభ్యర్థులైనా సామా రంగ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ వంటి వారికి కూడా వారికి కావలసిన ఎల్‌బీనగర్‌, కోదాడ సీట్లు తెచుకోలేకపోయారు. బొల్లం మల్లయ్య యాదవ్ వెంటనే తెరాస లాక్కుని అతనికి కోదాడ టిక్కెట్టు ఇచ్చిందంటే అక్కడ అతని పట్టు ఏంటో, టీడీపీ ఏం కోల్పోయిందో అర్ధం అవుతుంది. ఇందులో పార్టీ స్వయంకృతాపరాధలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 12 సీట్లలో సాధ్యమైనన్ని గెలిచి మహాకూటమి అధికారంలోకి వస్తే గానీ టీడీపీ మనుగడ సాగించడం కష్టమే.