TDP Munugode by-election Jakkali Ilaiah Yadavతెలంగాణలో అధికార టిఆర్ఎస్‌, బిజెపిల మద్య సాగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో రెండు పార్టీలు తమ బలాబలాలు తేల్చుకొనేందుకు బలవంతంగా మునుగోడు ఉపఎన్నికలను తెచ్చిపెట్టాయి. ఆ ఉపఎన్నికలలో టిడిపి కూడా పోటీ చేయడానికి సిద్దపడింది.

మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ను బరిలో దించాలని టిడిపి నేతలు భావించారు. ఈ ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేయబోతోందని వినగానే టిఆర్ఎస్‌ తరపున ఈ ఉపఎన్నికలను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్‌ రావు కూడా ఆందోళన చెందినట్లున్నారు. బీసీ ఓట్లను చీల్చి బిజెపికి మేలు చేసేందుకే టిడిపి పోటీకి దిగుతోందని ఆరోపించారు.

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలు కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటిని ఏవిదంగానైనా దెబ్బ తీయాలని పట్టుదలగా ప్రజాశాంతి పార్టీ అధినేత, వేలకోట్లు కలిగిన బిలియనీర్‌ కేఏ పాల్ కూడా తమ పార్టీ అభ్యర్ధిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను బరిలో దించారు. ఒకవేళ తన అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కేఏ పాల్ డబ్బు ఖర్చుపెట్టడం మొదలుపెడితే, ఏ పార్టీలు కూడా ఆయన ముందు నిలవలేవని చెప్పవచ్చు.

ఇక బడుగు బలహీనవర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ కూడా ఈ ఉపఎన్నికల బరిలో దిగింది. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తండ్రి స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఆ నియోజకవర్గంతో బలమైన అనుబందం ఉండేది. కనుక ఆయన కుమార్తె స్రవంతికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంటుంది.

బిజెపి కూడా ఇప్పుడు ఎన్నికలలో ఖర్చుకు వెనకాడటం లేదు. కనుక ఈ పార్టీలన్నీ కలిసి టిఆర్ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

ఈ నేపధ్యంలో బీసీ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని టిడిపి కూడా బరిలో దిగితే టిఆర్ఎస్‌కు కష్టం ఇంకా పెరుగుతుంది. కనుకనే మంత్రి హరీష్‌ రావు ఆందోళన చెందినట్లున్నారు. అయితే ఆయనకు చాలా ఉపశమనం కలిగించే వార్తను టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు చెప్పారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నామినేషన్‌ గడువు ఇంకా ఒక్కరోజే ఉండటం, టిడిపి సిద్దంగా లేకపోవడం వలన ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాము. ఉపఎన్నికలో పోటీ చేయడం కంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకొన్నాము,” అని చెప్పారు.