KCR National Flagతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 291 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న ఈ భారీ జాతీయ జెండా నిర్వహణ అధికారులకు కష్టతరంగా మారింది. హుస్సేన్ సాగర్ పక్కనే సంజీవయ్య పార్క్ ఉండటంతో వేగంగా వీస్తున్న గాలులకు తరచుగా జెండా చిరిగిపోతోంది. ఒక్క నెల కూడా పూర్తి కాక మునుపే నాలుగు సార్లు జెండాను మార్చాల్సి వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు రోజులకే మొదటిసారిగా జెండా చిరిగిపోగా, ఆ తర్వాత మరో జెండాను ఏర్పాటు చేశారు. అది కూడా మూడు రోజులకే పటాపంచలైపోయింది. మళ్లీ మరో జెండాను ఏర్పాటు చేయడం, 12వ రోజునే అది కూడా చిరిగిపోవడంతో తలలు పట్టుకోవడం సంబంధిత అధికారుల వంతయ్యింది. అప్పటికి ఉన్న జెండాలన్నీ అయిపోవడంతో, పరిస్థితి గమనించిన అధికారులు చేసేదేమిలేక రెండు రోజుల పాటు పోల్ ను ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఎదురైంది.

రెండో జెండా చిరిగిన సమయంలో ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మూడు జెండాలను ఆర్డర్ ఇచ్చి తెప్పించింది తెలంగాణ సర్కార్. కాగా, మొదటి మూడు జెండాలను ఖమ్మంలో తయారు చేయించారు. ఒక్కొక్క జెండా ఖరీదు దాదాపుగా లక్షన్నరున్నట్లు సమాచారం. వేగంగా వీస్తున్న గాలులకు జెండాలు పదే పదే చినిగిపోతున్న విషయాన్ని వివరిస్తూ, ఢిల్లీలోని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేవి గిల్ ను తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఫోన్ లో సంప్రదించి, నియమ నిబంధనలు తెలుసుకుంది.

గాలులకు జెండాలు చిరగడం మాన్యమెంట్ ఫ్లాగ్ కేటగిరి కిందకు వస్తుందని, జెండా తొలగించినా కొన్ని రోజులు ఇబ్బంది ఉండదనే విషయం నియమ నిబంధనల్లో ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల పాటు ఖాళీగా ఉంచిన పోల్ పై ఆ తర్వాత మరో జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం పోల్ పై రెపరెపలాడుతున్న జెండా నాలుగోది. కాగా, జెండాలు పదే పదే చిరిగిపోతుండటంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని, ఈ ప్రతిష్టాత్మక జెండా నిర్వహణ కష్టసాధ్యమవుతుందేమోనని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.