Telangana-Formation-10-Yearsఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 2014, జూన్ 2న విడిపోయాయి. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆదేరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకొంటోంది. ఇప్పుడు పదో ఏడాదిలో అడుగు పెడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల పాటు అట్టహాసంగా దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించుకొంటోంది.

గత తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఏవిదంగా అభివృద్ధి చెందిందో గుర్తుచేసుకొంటూ ఈ ఉత్సవాలను నిర్వహించబోతోంది. తెలంగాణలో బిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు జరుగుతున్నప్పటికీ, వాటి వలన అభివృద్ధి, సంక్షేమ పధకాలకు అవాంతరం ఏర్పడలేదు. ఎందుకంటే అక్కడ స్థిరంగా ఒకరే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం ఉంది కనుక!

ఇక ఏపీ విషయానికి వస్తే, తొమ్మిదేళ్ళ తర్వాత రాజధాని ఏదో, కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడో చెప్పుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇది పాలకుల తప్పే తప్ప ప్రజల తప్పు కాదు. కానీ ఇందుకు ప్రజలే సిగ్గుపడుతున్నారు తప్ప పాలకులు ఏమాత్రం సిగ్గు పడటం లేదు.

తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కలిసి అభివృద్ధి ఉత్సవాలు జరుపుకొంటుంటే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళ పాలన ఉత్సవాలు జరుపుకొంటోంది. ఈ నాలుగేళ్ళలో చేసిన అప్పులు కొండంత కనిపిస్తున్నాయి తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. అయినా పండగ చేసుకొందాం అంటోంది. ఇంతకాలం అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలు మాత్రమే అని గట్టిగా వాదించిన వైసీపీ పాలకులు ఎన్నికలు దగ్గరపడుతుంటే పారిశ్రామికవాడలు, పోర్టులకు శంకుస్థాపనలు చేస్తూ ‘ఇదే అభివృద్ధికి శ్రీకారమని’ గర్వంగా చెప్పుకొంటున్నారు.

గత ప్రభుత్వం మొదలుపెట్టిన రాజధాని అమరావతి, పోలవరం తదితర పలు అభివృద్ధి పనులను కొనసాగించడానికి ఇష్టపడని వైసీపీ ప్రభుత్వం, టిడిపి మరిన్ని సంక్షేమ పధకాలను ప్రకటించక తప్పని పరిస్థితి కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ రాజకీయాలు రాష్ట్రం పాలిట శాపంగా మారాయని చెప్పొచ్చు.

బాల్యంలో పిల్లలని చక్కగా తీర్చిదిద్దితే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అదేవిదంగా బాల్యావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకం. కానీ సరిగ్గా ఇప్పుడే విధ్వంసం జరుగుతోంది. కనుక రాష్ట్ర భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. అయినా ‘పండుగ చేసుకొందాం… పదండి’ అంటే ఏమనుకోవాలి?