telangana-state Congressగత శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీని ఖాళి చేసింది. చివరికి ఆ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారితో మేము పార్టీ శాసనసభ పక్షాన్ని తెరాసలో విలీనం చేస్తున్నామని స్పీకర్ దగ్గర ప్రకటించింది. ఆ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం వర్తింపచెయ్యకుండా కాపాడింది. అలా పార్టీ మారిన వారు మంత్రులుగా కూడా కొనసాగారు. శాసనసభ రికార్డులలో తలసాని వంటి వారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.

ఇప్పుడు అదే మంత్రాన్ని కాంగ్రెస్ పై కూడా ప్రయోగిస్తోంది తెరాస. ఇటీవలే తెరాస నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై తెరాస వారు కౌన్సిల్ ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కొంత మంది ఎమ్మెల్సీలు తమ పార్టీ నుండి తెరాసలోకి చేరారని ఛైర్మన్ వద్ద కంప్లయింట్ చేసింది. వీరి మీద యాక్షన్ తీసుకోకుండా తెరాస ఇచ్చిన కంప్లయింట్ మీద చర్య తీసుకుంటే విమర్శలకు దారి తీయవచ్చని అసలు కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేద్దామని ప్లాన్ గా కనిపిస్తుంది.

ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌ శుక్రవారం కలిశారు. విలీనం చేయాలని కోరుతూ లేఖ అందజేశారు. అయితే పార్టీ ఫిరాయించిన వారితో సమావేశం ఎలా చెల్లుబాటవుతుందని, వారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని కాంగ్రెస్ ఛైర్మన్ ముందు వాదిస్తుంది.

కాంగ్రెస్ మండలి పక్షాన్ని తెరాసలో విలీనం చెయ్యడానికి ఛైర్మన్ అనుమతిస్తే కాంగ్రెస్‌ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశం ఉంది. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉంటారు. వారి పదవీ కాలం కూడా మార్చితో ముగియనుంది. మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉండగా.. ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలితే ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది.